పొవార్‌ కోచింగ్‌ ముగిసింది... 

1 Dec, 2018 05:05 IST|Sakshi

కొత్త కోచ్‌ నియామక ప్రక్రియ షురూ 

రేసులో మూడీ, వాట్‌మోర్,  వెంకటేశ్‌ ప్రసాద్‌ 

న్యూఢిల్లీ: భారత మహిళల వన్డే సారథి మిథాలీ రాజ్‌ను తుది జట్టుకు దూరం చేసిన వివాదంలో కేంద్రబిందువైన కోచ్‌ రమేశ్‌ పొవార్‌ కథ ముగిసింది. ఎలాంటి చర్యలు లేకుండానే, ఎవరు జోక్యం చేసుకోకుండానే అతని కోచింగ్‌కు తెరపడింది! ఎలాగంటే... ఈ మాజీ స్పిన్నర్‌ను కేవలం మూడు నెలల కాలానికే కోచ్‌గా నియమించారు. శుక్రవారంతో ఆ గడువు ముగిసింది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా కొత్త కోచ్‌ నియామక ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే సీనియర్‌ క్రికెటర్‌తో పొడచూపిన విబేధాల కారణం గా మళ్లీ పొవార్‌ కోచ్‌ పదవి చేపట్టే అవకాశం లేదు. ఆయన దరఖాస్తు చేసినా బీసీసీఐ ఈ ప్రక్రియలో పొవార్‌ పేరును పరిశీలించేందుకు సిద్ధంగా లేదు. హర్మన్, మిథాలీల మధ్య సఖ్యతపై బీసీసీఐ మాత్రం సానుకూల దృక్పథాన్ని ప్రకటించింది. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరు కలిసి పని చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.  బీసీసీఐ సీనియర్‌ మహిళల ఎలైట్‌ ‘ఎ’ గ్రూప్‌ వన్డే లీగ్‌ పోటీలు నేటి నుంచి విజయవాడలోని మూలపాడు మైదానంలో జరుగుతాయి. ఇందులో నేడు గోవాతో జరిగే మ్యాచ్‌లో రైల్వేస్‌ తరఫున మిథాలీరాజ్‌ బరిలోకి దిగుతుంది.

రేసులో ఎవరంటే... 
కొత్త కోచ్‌ అన్వేషణలో టామ్‌ మూడీ, డేవ్‌ వాట్‌మోర్, వెంకటేశ్‌ ప్రసాద్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టామ్‌ మూడీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌గా విజయవంతమయ్యారు. వాట్‌మోర్‌ 1996లో శ్రీలంకను విశ్వవిజేతను చేయడంలో సఫలమయ్యా రు. ఏదేమైనా... ప్లేయర్లకు, కోచ్‌కు మధ్య భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్ర త్తగా వ్యవహరించాలని బోర్డు భావిస్తోంది. కోచ్‌ పదవి కోసం దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 14 ఆఖరి తేదీ కాగా 20న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు