రన్నరప్‌ రామ్‌కుమార్‌

23 Jul, 2018 03:40 IST|Sakshi
రామ్‌కుమార్‌ రామనాథన్‌

న్యూపోర్ట్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓటమి

న్యూపోర్ట్‌ (అమెరికా): రెండు దశాబ్దాలుగా భారత క్రీడాకారులను ఊరిస్తోన్న అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) టూర్‌ సింగిల్స్‌ టైటిల్‌ నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఆదివారం ముగిసిన న్యూపోర్ట్‌ ఓపెన్‌ ‘హాఫ్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ రన్నరప్‌గా నిలిచాడు. రెండు గంటలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 161వ ర్యాంకర్‌ రామ్‌కుమార్‌ 5–7, 6–3, 2–6తో ప్రపంచ 48వ ర్యాంకర్, మూడో సీడ్‌ స్టీవ్‌ జాన్సన్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రామ్‌కుమార్‌ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు.

విజేతగా నిలిచిన స్టీవ్‌ జాన్సన్‌కు 99,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 68 లక్షల 29 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ రామ్‌కుమార్‌కు 52,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 97 వేలు)తోపాటు 150 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నైకు చెందిన 23 ఏళ్ల రామ్‌కుమార్‌ 6–4, 7–5తో టిమ్‌ స్మిజెక్‌ (అమెరికా)పై గెలుపొంది తన కెరీర్‌లో తొలిసారి ఏటీపీ–250 టూర్‌ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2009లో చెన్నై ఓపెన్‌లో, 2011లో దక్షిణాఫ్రికా ఓపెన్‌లో సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ ఫైనల్‌కు చేరిన తర్వాత భారత్‌ నుంచి రామ్‌కుమార్‌ రూపంలో మరో ప్లేయర్‌ ఏటీపీ టూర్‌ టోర్నీలో టైటిల్‌ పోరుకు చేరడం ఇదే ప్రథమం. సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. భారత్‌ తరఫున చివరిసారి ఏటీపీ టూర్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన ఆటగాడు లియాండర్‌ పేస్‌. 1998 న్యూపోర్ట్‌ ఓపెన్‌లో లియాండర్‌ పేస్‌ విజేతగా నిలిచాడు.  

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో సుకోవా, స్టిక్‌
అంతర్జాతీయ టెన్నిస్‌ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో వింబుల్డన్‌ మాజీ సింగిల్స్‌ చాంపియన్‌ మైకేల్‌ స్టిక్‌ (జర్మనీ), 14 గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన హెలెనా సుకోవా (చెక్‌ రిపబ్లిక్‌)లకు చోటు కల్పించారు. స్టిక్‌ 1991 వింబుల్డన్‌ టోర్నీలో బోరిస్‌ బెకర్‌ (జర్మనీ)పై వరుస సెట్‌లలో గెలిచాడు. 1994 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో... 1996 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో కఫెల్నికోవ్‌ (రష్యా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1997లో రిటైరయిన స్టిక్‌ కెరీర్‌ మొత్తంలో 18 సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించాడు.   


                   సుకోవా, మైకేల్‌ స్టిక్‌

మరిన్ని వార్తలు