రాణి రాంపాల్‌ అరుదైన ఘనత 

31 Jan, 2020 03:13 IST|Sakshi

‘వరల్డ్‌ గేమ్స్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపిక 

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌ కెరీర్‌లో మరో ఘనత చేరింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపికైన రాణికి ఇప్పుడు క్రీడా రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి పురస్కారం లభించింది. 2019 ‘వరల్డ్‌ గేమ్స్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా రాణి ఎంపికైంది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి హాకీ క్రీడాకారిణి ఆమెనే కావడం విశేషం. ఈ అవార్డు విజేత కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను భాగం చేస్తూ పోలింగ్‌ నిర్వహించారు. ఇందులో రాణికి మొత్తం 1,99,477 ఓట్లు పోలయ్యాయి.

రెండో స్థానంలో నిలిచిన ఉక్రెయిన్‌ కరాటే క్రీడాకారిణి స్టానిస్లావ్‌ హŸరునాకు 92 వేల ఓట్లు మాత్రమే పడ్డాయంటే రాంపాల్‌ సాధించిన ఆధిక్యం ఎలాంటిదో అర్థమవుతుంది. గత ఏడాది భారత జట్టు ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ గెలవగా రాణి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా ఎంపికైంది. ఆమె నాయకత్వంలోనే భారత జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 25 రకాల క్రీడాంశాల నుంచి ఒక్కో క్రీడా సమాఖ్య ఒక్కో ప్లేయర్‌ను ఈ అవార్డు కోసం నామినేట్‌ చేస్తుంది. 2019లో ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ఈసారి రాణి పేరును ప్రతిపాదించింది. విజేతగా నిలిచిన రాణిని ఎఫ్‌ఐహెచ్, భారత హాకీ సమాఖ్య (హెచ్‌ఐ) అభినందించాయి.

మరిన్ని వార్తలు