ఒక రోజు 95 ఓవర్లు!

30 Apr, 2015 01:28 IST|Sakshi
ఒక రోజు 95 ఓవర్లు!

రంజీల్లో మార్పులకు ప్రతిపాదన
ముంబై: భారత దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ టెక్నికల్ కమిటీ పలు సూచనలు చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో వీటి ని ప్రతిపాదించారు. వచ్చే నెలలో వీటిపై బోర్డు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ప్రధానంగా రెండు మార్పులపై దృష్టి పెట్టింది.
ప్రతీ రంజీ మ్యాచ్‌లో ఒక రోజు ఆటను 95 ఓవర్లకు పెంచాలని (సమయంలో మార్పు లేకుండా) సూచించింది.

ఇప్పటి వరకు ఇది 90 ఓవర్లుగా ఉంది. నాలుగు రోజుల్లో కలిపి పెరిగే 20 ఓవర్లతో మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. ఆస్ట్రేలియాలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒక రోజు 96 ఓవర్లు బౌల్ చేస్తున్నారు.
మ్యాచ్‌లో ఆసక్తి నిలబెట్టేందుకు మరో ప్రతిపాదన కూడా చేసింది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసిన సమయంలో ప్రత్యర్థిపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన జట్టుకు కూడా ఇప్పుడు ఒక పాయింట్ ఇస్తున్నారు. అయితే దీనిని పూర్తిగా తొలగించాలని భావిస్తున్నారు. ఆధిక్యం కోల్పోయిన జట్టు మ్యాచ్‌పై అనాసక్తి కనబరుస్తోంది. ఇకపై పాయింట్ లేకపోతే ఆ జట్టు దూకుడుగా ఆడి విజయం కోసం ప్రయత్నిస్తుందని కమిటీ భావిస్తోంది.
గత ఏడాది జరిగిన 115 రంజీ మ్యాచ్‌లలో 62 మ్యాచ్‌లలో మాత్రమే ఫలితం రావడంతో ఈ తరహా మార్పులపై ప్రతిపాదనలు వచ్చాయి.

మరిన్ని వార్తలు