కోల్‌కతా టెస్టును గుర్తు చేసిన జార్ఖండ్‌

13 Dec, 2019 19:56 IST|Sakshi

అగర్తలా : భారత టెస్టు క్రికెట్‌ తలరాతను మార్చింది 2001లో కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా  ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ కాగా, 85 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అగర్తలా వేదికగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన మ్యాచ్‌ జార్ఖండ్‌-త్రిపుర జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్‌ జట్టు సంచలనం సృష్టించింది. దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఫాలో ఆన్‌ ఆడి ప్రత్యర్థిని ఓడించిన తొలి జట్టుగా జార్ఖండ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో ఫాలో ఆన్‌ ఆడి గెలిచిన జట్టు లేకపోవడం గమనార్హం. 153 పరుగుల వెనుకంజలో ఉండి ఫాలో ఆన్‌ ఆడిన జార్ఖండ్‌ ఎవ్వరూ ఊహించని రీతిలో పుంజుకొని 54 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. (చదవండి: ‘ఔట్‌ కాదు.. నేను వెళ్లను’)

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 289 పరుగులకు ఆలౌటైంది. సారథి మిలింద్‌(59), హర్మీత్‌ సింగ్‌(56) ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన జార్ఖండ్‌.. త్రిపుర బౌలర్లు రానా(4/42), అభిజిత్‌ (3/43) ధాటికి 136 పరుగులకే ఆలౌటైంది. విరాట్‌ సింగ్‌(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు.  దీంతో 153 పరుగుల వెనుకంజలో ఉన్న జార్ఖండ్‌ను త్రిపుర సారథి మిలింద్‌ ఫాలో ఆన్‌ ఆడించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌ను చేపట్టిన జార్ఖండ్‌కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. త్రిపుర బౌలర్లు రాణించడంతో 138 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఈ తరుణంలో సారథి సౌరబ్‌ తివారీ(122 బ్యాటింగ్‌), ఇషాంక్‌ జగ్గీ(107 బ్యాటింగ్‌) రాణించడంతో జా​ర్ఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో జార్ఖండ్‌ జట్టుకు 255 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర అనూహ్యంగా 211 పరుగులకే కుప్పకూలింది. ఆశీష్‌ కుమార్‌(5/67), అజయ్‌ యాదవ్‌(2/31) చెలరేగడంతో త్రిపుర ప్రధాన బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేశారు. అయితే మణిశంకర్‌(103) సెంచరీతో పరుగుల పరంగా ఓటమి అంతరాన్ని తగ్గించాడు కానీ త్రిపురను గట్టెక్కించలేకపోయాడు.
 
   
2001లో ప్రపంచ చాంపియన్‌గా హవా కొనసాగుతున్న ఆసీస్‌పై ఫాలో ఆన్‌ ఆడిన టీమిండియా అనూహ్యంగా ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా టెస్టు క్రికెట్‌ సమూలంగా మారిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 274 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ టీమిండియాను ఫాలో ఆన్‌ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌(281), రాహుల్‌ ద్రవిడ్‌(180) అద్వితీయమైన ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ ముందు​ 384 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను హర్భజన్‌ సింగ్‌(6/73), సచిన్‌(3/31) బెంబేలెత్తించారు. దీంతో 212 పరుగులకే కంగారు జట్టు ఆలౌటైంది. దీంతో టీమిండియా 171 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తర్వాతనే మనం ఎవరినైనా ఓడించగలమనే విశ్వాసం భారత జట్టుకు, క్రికెటర్లకు ఏర్పడింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా