శుబ్‌మన్‌ అర్ధ సెంచరీ

2 Nov, 2018 01:53 IST|Sakshi

పంజాబ్‌ 261/6

ఆంధ్రతో రంజీ మ్యాచ్‌

అయ్యప్పకు 3 వికెట్లు

సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్‌ను రెండు తెలుగు జట్లు సానుకూలంగా ప్రారంభించాయి. గురువారం ఇక్కడ పంజాబ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆంధ్ర జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్‌ అప్పగించింది. శుబ్‌మన్‌ గిల్‌ (56), కెప్టెన్‌ మన్‌దీప్‌ సింగ్‌ (68), సన్‌వీర్‌ సింగ్‌ (63 బ్యాటింగ్‌) అర్ధశతకాలతో చెలరేగడంతో పంజాబ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. బండారు అయ్యప్ప 3 వికెట్లు పడగొట్టాడు.  

సంజు, సచిన్‌ బేబీ అర్ధ శతకాలు 
కేరళ, హైదరాబాద్‌ జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా ఆరంభమైన మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ... జలజ్‌ సక్సేనా (57), సంజు శామ్సన్‌ (53), కెప్టెన్‌ సచిన్‌ బేబీ (57 బ్యాటింగ్‌) అర్ధ సెంచరీలతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసింది.

సిక్కిం 15/5నుంచి 299/9కు... 
కోల్‌కతా: మణిపూర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక దశలో సిక్కిం స్కోరు 15/5. రంజీల్లో అత్యల్ప స్కోరు (21) రికార్డు కనుమరుగవుతున్నట్లు కనిపించింది. అయితే మిలింద్‌ కుమార్‌ (248 బంతుల్లో 202 బ్యాటింగ్‌; 29 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఏకంగా డబుల్‌ సెంచరీతో జట్టును గట్టె క్కించాడు. ఫలితంగా తొలి రోజు స్కోరు 299/9కు చేరింది.   

రంజీ కబుర్లు 
►ఢిల్లీలో ముంబై, ఢిల్లీ మ్యాచ్‌ సందర్భంగా కాలుష్యానికి తట్టుకోలేక పలువురు ఆటగాళ్లు మాస్క్‌లతోనే బరిలోకి దిగారు.  
►ముంబై తరఫున సిద్దేశ్‌ లాడ్‌ మ్యాచ్‌ ఆడుతుండగా... ప్రత్యర్థి రైల్వేస్‌ జట్టు తరఫున పరిశీలకుడిగా వచ్చిన అతని తండ్రి దినేశ్‌ లాడ్‌ కొడుకును ఔట్‌ చేసేందుకు వ్యూహ రచన చేయడం విశేషం.  
►డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్, బిహార్‌ జట్ల మధ్య మ్యాచ్‌కు కెమెరాలు లేకపోవడంతో ఈ మ్యాచ్‌ థర్డ్‌ అంపైర్‌ లేకుండానే సాగుతోంది 
► రైనా స్థానంలో యూపీ జట్టులోకి వచ్చిన అ„Š  దీప్‌ నాథ్‌ యో యో టెస్టులో విఫలమైనట్లు బుధవారమే తేలినా... అతనికి కెప్టెన్సీ సహా జట్టులో చోటివ్వడం వివాదం రేపింది.  
►నాగాలాండ్‌ తరఫున ఆడుతున్న ఇమ్లీవతీ లేమూర్‌ వృత్తిరీత్యా పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు. రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు జీతంలేని సెలవుతో ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు.  
► అరుణాచల్‌ ప్రదేశ్‌ తరఫున బరిలోకి దిగిన సందీప్‌ కుమార్‌ ఠాకూర్‌ వృత్తి రీత్యా క్రీడా పాత్రికేయుడు. ఆట ముగియగానే అతను తన పత్రిక ‘అరుణాచల్‌ ఫ్రంట్‌’కు మ్యాచ్‌ రిపోర్ట్‌ పంపిస్తాడు. అందులో అతని పేరు రాసుకోవాల్సి రావడం విశేషం. 

మరిన్ని వార్తలు