మూడు రోజుల్లోనే... హైదరాబాద్‌ ఖేల్‌ ఖతం

30 Jan, 2020 09:58 IST|Sakshi
విజయం అనంతరం రాజస్తాన్‌ జట్టు

9 వికెట్లతో రాజస్తాన్‌ ఘనవిజయం

మణీందర్‌ అజేయ సెంచరీ

రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: బౌలర్లు రాణించినా... బ్యాట్స్‌మెన్‌ అదే నిర్లక్ష్య ధోరణి కనబరచడంతో రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ మరో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శనతో మూడు రోజుల్లోనే రాజస్తాన్‌ విజయాన్ని కైవసం చేసుకుంది. ఏకంగా 9 వికెట్లతో హైదరాబాద్‌ను ఓడించి 18 జట్లున్న ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ అండ్‌ బి’లో రాజస్తాన్‌ 15వ స్థానం నుంచి పదో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్‌ మాత్రం అట్టడుగు స్థానానికే పరిమితమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 101/6తో ఆట మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 53.4 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. 

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 36 పరుగులు కలుపుకొని ప్రత్యరి్థకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అక్షత్‌ రెడ్డి (162 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అనికేత్‌ చౌదరి 4, తన్వీర్‌ ఉల్‌ హఖ్‌ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌లో మణీందర్‌ సింగ్‌ (147 బంతుల్లో 107 నాటౌట్‌; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో రాజస్తాన్‌ 48.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మహిపాల్‌ లామ్రోర్‌ (114 బంతుల్లో 71; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.  

55 పరుగులు 4 వికెట్లు 
మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్నప్పటికీ జరగాల్సిన నష్టమంతా మంగళవారమే జరిగిపోయింది. 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ను బుధవారం ఆటలో ఓపెనర్‌ అక్షత్‌ రెడ్డి ఆదుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ విఫలమైన అతను టెయిలెండర్లతో కలిసి పోరాడాడు. కానీ ఆట ప్రారంభంలోనే మిలింద్‌ (2), మెహదీహసన్‌ (7) వెనుదిరిగినా... సాకేత్‌ (25 బంతుల్లో 10; 1 ఫోర్‌) సహాయంతో అక్షత్‌ పరుగులు జోడించాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 34 పరుగుల్ని జోడించారు. తర్వాత 10 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 156 పరుగుల వద్ద ముగిసింది. దీంతో ప్రత్యర్థి ఎదుట సాధారణ లక్ష్యం నిలిచింది.  

చెలరేగిన మణీందర్, మహిపాల్‌ 
193 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన హైదరాబాద్‌ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశారు. 48.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం యశ్‌ కొఠారి (6) వికెట్‌ మాత్రమే తీయగలిగారు.  మణీందర్‌ సింగ్, మహిపాల్‌ జోడీ అలవోకగా పరుగులు సాధిస్తూ హైదరాబాద్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ముందుగా మణీందర్‌ 84 బంతుల్లో... మహిపాల్‌ 91 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. తర్వాత వేగంగా ఆడిన మణీందర్‌ మరో 60 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు అభేద్యంగా 176 పరుగులు జోడించి తమ జట్టును గెలిపించింది.  

స్కోరు వివరాలు 
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 171
రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 135
హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌: తన్మయ్‌ (సి) రితురాజ్‌ సింగ్‌ (బి) తన్వీర్‌ 16; అక్షత్‌ రెడ్డి (బి) మహిపాల్‌ 71; సందీప్‌ (బి) తన్వీర్‌ ఉల్‌ హఖ్‌ 9; హిమాలయ్‌ (సి) రితురాజ్‌ సింగ్‌ (బి) అనికేత్‌ చౌదరీ 2; జావీద్‌ అలీ (సి) మణీందర్‌ సింగ్‌ (బి) అనికేత్‌ 0; సుమంత్‌ కొల్లా (సి) ఆదిత్య (బి) శుభమ్‌ శర్మ 3; రవితేజ (సి) యశ్‌ (బి) అనికేత్‌ 20; మిలింద్‌ (సి) యశ్‌ (బి) అనికేత్‌ 2; మెహదీ హసన్‌ (సి) మణీందర్‌ సింగ్‌ (బి) తన్వీర్‌ 7; సాకేత్‌ (స్టంప్డ్‌) మణీందర్‌ సింగ్‌ (బి) శుభమ్‌ శర్మ 10; రవికిరణ్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (53.4 ఓవర్లలో ఆలౌట్‌) 156. 
వికెట్ల పతనం: 1–28, 2–46, 3–53, 4–53, 5–68, 6–101, 7–103, 8–112, 9–146, 10–156. 
బౌలింగ్‌: అనికేత్‌ చౌదరి 20–6–48–4, తన్వీర్‌ ఉల్‌ హఖ్‌ 14–2–44–3, రితురాజ్‌ సింగ్‌ 12–3–30–0, శుభమ్‌ శర్మ 6–1–22–2, మహిపాల్‌ 1.4–0–8–1. 
రాజస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌: యశ్‌ కొఠారి (ఎల్బీడబ్ల్యూ) (బి) రవితేజ 6; మణీందర్‌ సింగ్‌ (నాటౌట్‌) 107; మహిపాల్‌ (నాటౌట్‌) 71; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (48.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 195.  
వికెట్ల పతనం: 1–19. 
బౌలింగ్‌: రవికిరణ్‌ 11–3–44–0, మిలింద్‌ 10–1–22–0, రవితేజ 9–0–45–1, మెహదీ హసన్‌ 9.5–0–38–0, సాకేత్‌ 7–0–35–0, సందీప్‌ 2–1–5–0.   

మరిన్ని వార్తలు