చెలరేగిన సర్ఫరాజ్‌ ఖాన్‌

22 Jan, 2020 20:27 IST|Sakshi

ముంబై: యువ బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. అజేయ ట్రిఫుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఉత్తరప్రదేశ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో త్రిశతకం సాధించాడు. 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజైన మంగళవారం సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ ఆట నాలుగో రోజు బుధవారం ఏకంగా ట్రిఫుల్ సెంచరీ బాదేశాడు. ముంబై తరపున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకుముందు సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, వసీం జాఫర్‌, రోహిత్‌ శర్మ, విజయ్‌ మర్చంట్‌, అజిత్‌ వాడేకర్‌ ఈ ఘనత సాధించారు. ముంబై బ్యాట్స్‌మన్లు ట్రిఫుల్‌ సెంచరీ సాధించడం ఇది ఎనిమిదోసారి. వసీం జాఫర్‌ రెండుసార్లు ట్రిఫుల్‌ సెంచరీలు చేశాడు.

కాగా, ముంబై, యూపీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో యూపీ 625/8 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ముంబై జట్టు 688/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ముంబై కెప్టెన్‌ ఆదిత్య తారే(97), సిద్ధేశ్‌ లాడ్‌(98) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు.

మాజీ టీమ్‌పైనే సత్తా చాటాడు..
ముంబైకి చెందిన సర్ఫరాజ్‌ ఖాన్‌ గత రంజీ సీజన్‌ ఆరంభం వరకు ఉత్తరప్రదేశ్‌ తరపున ఆడాడు. తర్వాత ముంబై జట్టుకు మారాడు. వాంఖేడే మైదానంలో 2015లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో యూపీ తరపున బరిలోకి దిగిన సర్ఫరాజ్‌ కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. మళ్లీ ముంబై తరపున ఆడతానని ఊహించలేదని, ఇదంతా కలలా ఉందని సర్ఫరాజ్‌ అన్నాడు. ముంబై జట్టు తరపున ట్రిఫుల్‌ సెంచరీ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.

మరిన్ని వార్తలు