అతిగా ప్రవర్తించిన ఆటగాళ్లకు జరిమానా

22 Sep, 2018 18:45 IST|Sakshi

అబుదాబి : ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం అప్గనిస్తాన్‌-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన ఆటగాళ్లను గుర్తించిన మ్యాచ్‌ రిఫరీ వారి మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధిస్తూ.. ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా వేశారు. వేర్వేరు సందర్భాల్లో క్రీడా నియమావళిని అతిక్రమించిన పాకిస్తాన్‌ పేసర్‌ అలీ హసన్‌తో పాటు, అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ఖాన్‌, కెప్టెన్‌ అస్గర్‌ అప్గన్‌లపై ఈ జరిమాన పడింది.

అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ 33వ ఓవర్‌లో హస్మతుల్లా షాహిదీను అలీ హసన్ వ్యక్తిగతంగా దూషించాడు. 37వ ఓవర్లో హసన్ వికెట్ల మధ్య పరుగు తీస్తుండగా అస్గర్‌ అఫ్గన్ ఉద్దేశపూర్వకంగా హసన్‌ను తన భుజంతో ఢీకొట్టాడు. మరోవైపు పాక్ బ్యాట్స్‌మన్ ఆసిఫ్ అలీని ఔట్ చేసిన తరువాత రషీద్.. తన చేతి వేళ్లతో అసభ్యకర రీతిలో బ్యాట్స్‌మన్‌కు వీడ్కోలు పలికాడు. మ్యాచ్‌ అనంతరం ఈ ఘటనలపై విచారణ జరిపిన ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు ముగ్గురు ఆటగాళ్లు తమ తప్పులను ఒప్పుకున్నారు. దీంతో వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు