ఐదోసారి తండ్రైన ఆఫ్రిది.. ‘ఏ’ అక్షరమైతే భళా!

15 Feb, 2020 18:52 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది కుటుంబం ప్రస్తుతం ఆనంద డోలికల్లో తేలియాడుతోంది. ఇప్పటికే నలుగురు కూతుళ్లకు తండ్రైన ఆఫ్రిదికి.. మరోసారి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఆఫ్రిది అభిమానులతో పంచుకున్నాడు. తన మీద దయతో దేవుడు అద్భుతమైన కూతుళ్లను ప్రసాదించాడంటూ ఓ ఫొటోను షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా చిన్నారి కూతురికి పేరు ఎంపిక చేసే అవకాశాన్ని అభిమానులకు ఇస్తున్నట్లు ఆఫ్రిది పేర్కొన్నాడు.

ఈ మేరకు.. ‘‘ నా కూతుళ్లందరి పేరు ‘ఏ’  అక్షరంతో మొదలవుతున్న పరంపరను మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాపాయికి కూడా ‘ఏ’ అక్షరంతో మొదలయ్యే పేరును ఎంపిక చేయడంలో నాకు సహాయం చేయండి. ఇది నా అభిమానుల కోసం. విజేతకు మంచి బహుమతి కూడా ఇస్తాను! అక్సా, అన్షా, అజ్వా , అస్మారా ఇలాంటి పేర్లను సూచించండి’’ అంటూ ఆఫ్రిది ట్వీట్‌ చేశాడు.(భారత్‌-పాక్‌ సిరీస్‌; రాజకీయాలు సరికాదు)

ఇందుకు స్పందించిన ఆఫ్గనిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌.. ‘అఫ్రీన్‌ అయితే బాగుంటుంది. ఈ పేరుకు సాహసం అని అర్థం’ అని బదులిచ్చాడు. కాగా పాక్‌ క్రికెట్‌కి విశేష సేవలందించిన ఆఫ్రిది.. కూతుళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటానంటూ తన ఆత్మకథలో పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌ లాంటి ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడడానికి వాళ్లకు అనుమతి ఇవ్వనని పుస్తకంలో పేర్కొన్నాడు. ఇస్లాం నియమాలను గౌరవిస్తూ... సామాజిక కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని తన కూతుళ్లను ఇండోర్‌ గేమ్స్‌కే పరిమితం చేస్తానని స్పష్టం చేశాడు.(‘హారతి’ ఇస్తుందని టీవీ పగలగొట్టిన పాక్‌ క్రికెటర్‌)

మరిన్ని వార్తలు