‘సచిన్‌ ఔట్‌ అవ్వాలని కోరుకునేవాడిని కాదు’

14 May, 2020 10:17 IST|Sakshi

హైదరాబాద్‌: క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌పై పాకిస్తాన్‌ మాజీ వికెట్‌ కీపర్‌ రషీద్‌ లతీఫ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతడు ఔటవ్వాలని తన అంతరాత్మ అస్సలు కోరుకునేది కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుధవారం వీడియో చాట్‌లో పాల్గొన్న ఈ మాజీ వికెట్‌ కీపర్‌ సచిన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. యువ క్రికెటర్లకు అతడొక మార్గనిర్దేశకుడని, ఆట పట్ల సచిన్‌కు ఉన్న మక్కువ మరే ఇతర ఆటగాళ్లలో చూడలేదన్నాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో చోటుచేసుకున్న వివాదాల్లో సచిన్‌ పేరు ఎక్కడా వినిపించని విషయాన్ని గుర్తుచేశాడు. ఈ విషయంలో సచిన్‌ నుంచి ఎంతో స్పూర్థి పొందాలని యువ ఆటగాళ్లుకు రషీద్‌ సూచించాడు. 

‘200 టెస్టులు, 400కి పైగా వన్డేలు ఆడటం మామూలు విషయం కాదు. క్రికెట్‌ చరిత్రలో ఏ రికార్డు చూసినా, అత్యుత్తమ 11 మంది క్రికెటర్ల జాబితాలో కచ్చితంగా ఉండే పేరు సచిన్‌. ఇక నేను కీపింగ్‌ చేస్తున్న సమయంలో అతడి బ్యాటింగ్‌ను ఆస్వాదించేవాడిని, అతడు ఔటవ్వాలని నా మనస్సు అస్సలు కోరుకునేది కాదు. అయితే ఇదే క్రమంలో బ్రయాన్‌ లారా, పాంటింగ్‌​, కలిస్‌ వంటి ప్లేయర్స్‌ అవుటవ్వాలని గట్టిగా ప్రయత్నించేవాడిని. ఇక ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సచిన్‌ వ్యక్తిత్వం చాలా విభిన్నమైనది. స్లెడ్జింగ్‌ చేసినా, ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా ఏకాగ్రత కోల్పోకుండా నవ్వుతాడు, తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడు. అనేక మంది ఆటగాళ్లు సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకున్నారు’ అని రషీద్‌ లతీఫ్‌ వ్యాఖ్యానించాడు. 

చదవండి:
'ఆరోజు పాంటింగ్‌ చెత్త నిర్ణయం తీసుకున్నాడు'
'ఆ విషయంలో సచిన్‌ కంటే కోహ్లి ముందుంటాడు'

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు