విజృంభించిన రవికిరణ్

12 Dec, 2016 15:12 IST|Sakshi

వడోదర: జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజు తన్మయ్ సెంచరీ సాధించగా, రెండో రోజు బౌలింగ్‌లో రవికిరణ్ (4/31) నిప్పులు చెరిగాడు. దీంతో కశ్మీర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఒక్క పర్వేజ్ రసూల్ (81 బంతుల్లో 70; 11 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఆట నిలిచే సమయానికి జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ లో 46 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

 హైదరాబాద్ 328 ఆలౌట్

 అంతకుముందు 234/3 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌‌స 131.3 ఓవర్లలో 328 పరుగుల వద్ద ముగిసింది. మరో 94 పరుగులే జోడించి మిగతా 7 వికెట్లను కోల్పోయింది. కశ్మీర్ బౌలర్లు పర్వేజ్ రసూల్ (4/63), సమీయుల్లా బేగ్ (3/77), సుహెయిల్ అండ్లీవ్ (2/57) సమష్టిగా రాణించడంతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజ్‌లో నిలువలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ (321 బంతుల్లో 119; 17 ఫోర్లు) మరో 13 పరుగులు చేసి నిష్క్రమించగా, బావనక సందీప్ (16), కె.సుమంత్ (0) నిరాశ పరిచారు. ఇద్దర్ని సమీయుల్లా పెవిలియన్‌కు పంపాడు. సీవీ మిలింద్ (19), ఆకాశ్ భండారీ (13), సిరాజ్ (13)లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.

 కశ్మీర్ బ్యాట్స్‌మెన్ విలవిల
 
 అనంతరం తొలి ఇన్నింగ్‌‌స ఆరంభించిన కశ్మీర్‌ను రవికిరణ్ కోలుకోలేని దెబ్బతీశాడు. ఓపెనర్లు అహ్మద్ (0), శుభం (2)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 3 పరుగులకే ఆ రెండు వికెట్లు పడ్డాయి. కాసేపటికి ప్రణవ్ (6)ను మిలింద్, దేవ్ సింగ్ (14)ను సిరాజ్ ఔట్ చేయడంతో 31 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోరుున జమ్మూకశ్మీర్ కష్టాల్లో పడింది. ఈ దశలో పర్వేజ్...  ఆదిత్య సింగ్ (14)తో కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత రవికిరణ్ స్వల్ప వ్యవధిలో ఆదిత్యను, పునీత్ బిస్త్ (6)లను పెవిలియన్ పంపించి కశ్మీర్‌ను మళ్లీ దెబ్బతీశాడు. ఆట నిలిచే సమయానికి సమీయుల్లా (28 బ్యాటింగ్), రామ్ దయాళ్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
 
 సంక్షిప్త స్కోర్లు
 హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌‌స: 328 (తన్మయ్ 119; పర్వేజ్ 4/63, సమీయుల్లా 3/77), జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్‌‌స: 156/7 (పర్వేజ్ 70; రవికిరణ్ 4/31, మిలింద్ 1/27)
 

మరిన్ని వార్తలు