కోచ్‌గా రవిశాస్త్రి: చక్రం తిప్పింది ఇద్దరే!

12 Jul, 2017 12:33 IST|Sakshi
కోచ్‌గా రవిశాస్త్రి: చక్రం తిప్పింది ఇద్దరే!

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పంతం నెగ్గించుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ సమయంలో కోహ్లీతో విభేదాలు తారాస్థాయికి చేరడంతో.. టోర్నీ ముగిశాక ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న విషయం తెలిసిందే. ఆపై  విండీస్‌ టూర్‌కు కోచ్ లేకుండానే వెళ్లిన టీమిండియా 3-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుని, ఏకైక టీ20లో ఓటమి పాలైంది. త్వరలో జరగనున్న శ్రీలంక టూర్‌కు కూడా టీమిండియా కోచ్ లేకుండానే వెళ్తుందని బీసీసీఐ కూడా భావించింది. కానీ సీఏసీ సలహామేరకు దరఖాస్తులు స్వీకరించిన బీసీసీఐ, రవిశాస్త్రికి మరో చాన్స్ ఇచ్చింది. చివరికి అతని పనితీరు, అనుభవమే కోచ్ పదవిని కట్టబెట్టిన మాట వాస్తవమే అయినా ఇద్దరు వ్యక్తులు రవిశాస్త్రికి మద్ధతుగా నిలిచి కోచ్ ఎంపిక ప్రక్రియలో చక్రం తిప్పారు.

ఆ ఇద్దరిలో ఒకరు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కాగా రెండో వ్యక్తి టీమిండియా కెప్టెన్ కోహ్లీ. 2014-16 సమయంలో టీమ్ డైరెక్టర్‌గా శాస్త్రి చేసిన సమయంలో భారత్ పలు విజయాలు సాధించింది. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కోహ్లీకి రవిశాస్త్రి వర్కింట్ స్టైల్ అంటే ఇష్టం. కుంబ్లే అయితే క్రమశిక్షణ అంటూ ఆటగాళ్లను గీత దాటనిచ్చేవాడు కాదు. ఇది కూడా వీరి మధ్య గొడవకు ఓ కారణం. తమకు వచ్చిన దరఖాస్తులలో సీఏసీ సభ్యులు సచిన్, లక్ష్మణ్, గంగూలీలు మాజీ క్రికెటర్ సెహ్వాగ్, రవిశాస్త్రిల పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. పాత గొడవల కారణంగా గంగూలీ.. రవిశాస్త్రి వైపు మొగ్గు చూపలేదు కానీ సచిన్ జోక్యం చేసుకుని 'దాదా'ను బుజ్జగించడంతో మార్గం సుగమమైంది.

స్వతహాగా శాస్త్రితో పాటు సచిన్ 'ముంబైకర్' కావడం, వీరుకు జాతీయస్థాయిలో కోచింగ్ అనుభవలేమి మైనస్ పాయింట్ గా మారినట్లు కనిపిస్తోంది. దాంతోపాటు కోచ్ ఎంపికలో కీలకమైన కెప్టెన్ కోహ్లీకి రవిశాస్త్రిపై నమ్మకంతో పాటు ప్రత్యేక అభిమానం ఉన్నాయి. సీఏసీ సభ్యులతో పాటు కోహ్లీ కూడా శాస్త్రి వైపు మొగ్గుచూపడంతో ఈ నిర్ణయాన్ని బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. మేనేజర్‌గా, టీమ్‌ డైరెక్టర్‌ హోదాలో గతంలో పని చేసిన రవిశాస్త్రి ఇంగ్లండ్‌లో జరిగే 2019 ప్రపంచ కప్‌ వరకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.

మరిన్ని వార్తలు