కొనసాగింపు...

3 Jun, 2015 01:01 IST|Sakshi
కొనసాగింపు...

♦ భారత జట్టు డెరైక్టర్‌గా రవిశాస్త్రి
♦ సహాయక కోచ్‌లుగానూ పాతవాళ్లే
♦ బంగ్లాదేశ్ పర్యటన వరకు మాత్రమే
 
 న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ పర్యటనకు ముందు కొత్త కోచ్ ఎంపిక సాధ్యం కాకపోవడంతో... పాత బృందాన్నే తాత్కాలికంగా కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ప్రపంచకప్ వరకూ జట్టు డెరైక్టర్‌గా ఉన్న రవిశాస్త్రిని బంగ్లాదేశ్ పర్యటనకూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే అసిస్టెంట్ కోచ్‌లుగా సంజయ్ బంగర్ (బ్యాటింగ్), అరుణ్ (బౌలింగ్), శ్రీధర్ (ఫీల్డింగ్)లను కొనసాగించారు. ఈ బృందం ప్రపంచకప్ సమయంలో నిర్వర్తించిన బాధ్యతలనే ఈసారి కూడా నిర్వర్తిస్తుంది.

ఈ నియామకాలన్నీ బంగ్లాదేశ్ పర్యటన వరకేనని, ఆ తర్వాత కొత్త కోచ్‌ను నియమిస్తామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. కొత్తగా నియమించిన సలహా కమిటీ (సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్)తో చర్చల తర్వాత కోచ్ నియామకం ఉంటుందన్నారు. ఈ నెల 10 నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ జట్టు ఏకైక టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈ నెల 7న ఈ పర్యటన కోసం భారత జట్టు బంగ్లాదేశ్ వెళుతుంది. 2007 ప్రపంచకప్ తర్వాత చాపెల్ కోచ్‌గా రాజీనామా చేయడంతో... అప్పటి బంగ్లా పర్యటనకు కూడా రవిశాస్త్రి జట్టుతో పాటు వెళ్లారు.
 
 ఆటగాళ్ల మద్దతు వల్లే...
  న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనకు టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించడానికి బీసీసీఐ పెద్ద కసరత్తే చేసింది. శాశ్వత కోచ్ లేకపోవడంతో దిగ్గజాల్లో ఒకర్ని జట్టుతో పాటు పంపాలని మొదట బోర్డు ప్రయత్నించింది. కానీ దీనికి ఆటగాళ్ల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. దీంతో జట్టులోని సీనియర్లతో బీసీసీఐ అనధికారికంగా చర్చలు జరిపింది. చాలా మంది ఆటగాళ్లు శాస్త్రి పట్ల సానుకూలంగా స్పందించారని సమాచారం. ఓవైపు ‘హై పెర్ఫార్మెన్స్ డెరైక్టర్’గా సౌరవ్ గంగూలీని బరిలోకి తీసుకురావాలని బీసీసీఐలోని కొంత మంది పెద్దలు ప్రయత్నించారు.

కానీ ఆస్ట్రేలియా పర్యటన, ప్రపంచకప్‌లో శాస్త్రి చేసిన ‘మ్యాన్ మేనేజ్‌మెంట్’కు ఆకర్షితులైన సీనియర్లు ఇదే విషయాన్ని బోర్డుకు సవివరంగా చెప్పినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. అలాగే సహాయక సిబ్బంది గురించి కూడా కోహ్లి, ధోనిల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కోచింగ్ బృందంలో శాస్త్రికి ఉన్నంత పేరు ఎవరికీ లేకపోవడంతో సాధారణంగా చాలా మంది ఆటగాళ్లు కూడా ఆయనే కావాలని పట్టుబట్టారు. దీంతో క్రికెటర్ల అభిప్రాయాలకు విలువ ఇస్తూ శాస్త్రిని టీమ్ డెరైక్టర్‌గా కొనసాగించామని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కెప్టెన్ కోరుకున్నట్లే జట్టు ఉండాలని ఇటీవల కోహ్లి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ‘జట్టుతో పాటు శాస్త్రి ఉండటం చాలా బాగుంటుంది. డెరైక్టర్‌గా కొనసాగినా సంతోషమే. ఆయన మాతో పాటు ఉండటం వల్ల అదనపు బలం వస్తుంది. కోచ్‌గానా, డెరైక్టర్‌గానా అనేది పక్కనబెడితే.. అతనితో కూర్చుంటే అన్ని విషయాలు చర్చించుకోగలుగుతాం’ అని కోహ్లి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు