'ఐపీఎల్‌ ప్రదర్శనతోనే ధోని భవితవ్యం తేలనుంది'

26 Jan, 2020 11:50 IST|Sakshi

ఆక్లాండ్‌ : సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన నమోదు చేయకపోతే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి స్వయంగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో మాజీ కెప్టెన్ ధోనికి చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కొందరూ ధోని రీ ఎంట్రీ పక్కా.. అంటే, మరికొందరూ జార్ఖండ్ డైనమైట్ ఇంటర్నేషనల్ కెరీర్‌ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ ధోని భవితవ్యంపై రవిశాస్త్రి మరోమారు స్పందించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 విజయానంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోని భవితవ్యం ఐపీఎల్‌‌తో తేలనుందని పేర్కొన్నాడు.

'రానున్న ఐపీఎల్ ధోనికి ఎంత కీలకమో సెలెక్టర్లు, కెప్టెన్‌తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. ధోని తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడని, ఈ విధంగానే అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. కాగా ఐపీఎల్‌కు సంబంధించి ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఐపీఎల్‌లో మాత్రం కచ్చితంగా ఆడుతాడు.ఐపీఎల్‌లో ఆడే ఆటతోనే అతని భవితవ్యం ముడిపడి ఉంది. ఒక వేళ ఐపీఎల్‌లో తన ఆటతో మెప్పించలేకపోతే ధోనినే నిర్మోహమాటంగా తప్పుకుంటాడని' రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.('ధోనికి ప్రత్యామ్నాయం అతడే')

గతేడాది వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం ధోని ఆటకు దూరమైన విషయం తెలిసిందే. కొన్నాళ్లు ఆర్మీతో గడిపినా.. అనంతరం తన భవితవ్యంపై స్పష్టతనివ్వకుండా మౌనంగానే ఉన్నాడు. పైగా జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సూచించాడు. ఆటకు దూరమవడంతోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలిగించింది. అయితే ఇటీవల జార్ఖండ్ టీమ్‌తో కలిసి ధోని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ వార్తలను జార్ఖండ్ టీమ్ పెద్దలు కూడా ధృవీకరించారు. ఐపీఎల్ కోసమే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిపారు.(నేను సెలక్టర్‌ను కాదు కోచ్‌ను: రవిశాస్త్రి)

మరిన్ని వార్తలు