సమర్థించుకున్న రవిశాస్త్రి

12 Jul, 2019 20:10 IST|Sakshi
ధోనితో రవిశాస్త్రి (ఫైల్‌)

మాంచెస్టర్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఎంఎస్‌ ధోనిని ఏడవ స్థానంలో బ్యాటింగ్‌కు పంపడాన్ని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి సమర్థించుకున్నాడు. ధోనిని ముందుగా బ్యాటింగ్‌ పంపివుంటే బాగుండేదని మాజీ కెప్టెన్లు సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడిన నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ధోని అనుభవం లోయర్‌ ఆర్డర్‌లోనే ఎక్కువ అవసరమన్న అభిప్రాయంతోనే దినేశ్‌ కార్తీర్‌, హార్దిక్‌ పాండ్యా తర్వాత అతడిని బ్యాటింగ్‌కు దించినట్టు వెల్లడించారు.

‘ఇది జట్టు సమిష్టి నిర్ణయం. మేమంతా ఆషామాషీగా ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎంఎస్‌ ధోని ముందుగా వచ్చి తొందరగా ఔటవ్వాలని మీరు కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. ధోని త్వరగా ఔట్‌ అయితే ఛేజింగ్‌ మరింత కష్టమయ్యేది. అతడి అనుభవాన్ని చివర్లో వాడుకోవాలని అనుకున్నాం. ధోని గొప్ప ఫినిషర్‌ అన్న విషయం అందరికీ తెలుసు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఆడాలో అతడికి బాగా తెలుసు. చివరి ఓవర్‌లో ఏ బంతిని ఎలా కొట్టాలో ముందుగా మైండ్‌లో లెక్కేసుకున్నట్టుగా కనిపించాడు. దురదృష్టవశాత్తు రనౌట్‌ అయి లెక్కలు తప్పడంతో అతడి ముఖంలో విచారం స్పష్టంగా కనబడింద’ని రవిశాస్త్రి వివరించాడు. కీలక సమయంలో చెత్త షాట్‌ ఆడి ఔటైన యువ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ను ఆయన వెనకేసుకొచ్చాడు. పంత్‌కు పెద్దగా అనుభవం లేదని, మెల్లగా నేర్చుకుంటాడని సమర్థించాడు. పంత్‌, పాండ్యా అవుటైన తర్వాత అసమాన పోరాటపటిమ చూపి లక్ష్యానికి దగ్గర రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు