పంతం నెగ్గింది!

19 Jul, 2017 00:08 IST|Sakshi
పంతం నెగ్గింది!

రవిశాస్త్రి కోరుకున్నవారే సహాయక బృందంలోకి
భారత బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌
బంగర్‌కు అసిస్టెంట్‌ కోచ్‌ హోదా
ఫీల్డింగ్‌ కోచ్‌గా ఆర్‌. శ్రీధర్‌


ఏడాది క్రితం ఇంటర్వ్యూలో కోచ్‌ పదవిని దక్కించుకోలేకపోయిన రవిశాస్త్రి సంవత్సరం తిరిగే లోపే భారత క్రికెట్‌కు సంబంధించి మరోసారి ప్రధాన కేంద్రంగా ఎదిగారు. నాటి సలహాదారుల కమిటీ ద్వారానే మళ్లీ కోచ్‌గా ఎంపికవడమే కాకుండా... తనతో కలిసి పని చేసే సహాయక సిబ్బంది ఎంపికలో కూడా తన ముద్ర చూపించారు. కమిటీ ఎంచుకున్న బౌలింగ్, బ్యాటింగ్‌ సలహాదారులు జహీర్‌ ఖాన్, రాహుల్‌ ద్రవిడ్‌లను కాదంటూ తనకు నచ్చినవారినే బృందంలోకి తీసుకురాగలిగారు. కోహ్లి అండతో హెడ్‌ కోచ్‌గా మారి, ఇప్పుడు తన పంతం కూడా నెగ్గించుకోగలిగిన రవిశాస్త్రి రాబోయే రెండేళ్లు ఎలా పని చేస్తారన్నది ఆసక్తికరం.

ముంబై: భారత క్రికెట్‌ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా భరత్‌ అరుణ్‌ ఎంపికయ్యారు. ఇప్పటి వరకు బ్యాటింగ్‌ కోచ్‌గా పని చేస్తున్న సంజయ్‌ బంగర్‌కు అసిస్టెంట్‌ కోచ్‌ హోదా దక్కగా... ఆర్‌. శ్రీధర్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా కొనసాగుతారు. మంగళవారం బీసీసీఐ ఈ ఎంపికను ప్రకటించింది. బౌలింగ్‌ కోచ్‌గా అరుణ్‌ కావాలంటూ కొద్ది రోజులుగా పట్టుబట్టిన హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి... సోమవారమే దీనిపై బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, సీఈఓ రాహుల్‌ జోహ్రి, సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీలతో చర్చించారు. ఆయన సూచనల మేరకు వీరి నియామకాలకు బోర్డు అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. రవిశాస్త్రితో పాటు ఈ ముగ్గురి పదవీ కాలం కూడా 2019 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు ఉంటుంది. గతంలో రవిశాస్త్రి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ ముగ్గురే ఆయనతో కలిసి పని చేశారు.

అనేక మలుపుల తర్వాత...
గత మంగళవారం రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసిన సమయంలో బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్, బ్యాటింగ్‌ సలహాదారుడిగా రాహుల్‌ ద్రవిడ్‌ పేర్లను కూడా సీఏసీ ప్రకటించింది. అయితే వారు తమ పరిధి దాటారంటూ సీఓఏ నుంచి విమర్శలు రావడం... శాస్త్రితో సంప్రదించిన తర్వాతే పేర్లు ప్రకటించామంటూ సీఏసీ లేఖ రాయడం... అసలు వారిద్దరి ఎంపికను ఖరారు చేయలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని మళ్లీ బోర్డు నుంచి వివరణ రావడం వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది. చివరకు శాస్త్రి చెప్పిన వారికే బోర్డు ఓటు వేసింది. అయితే బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి మాత్రం ఈ అంశాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అసలు ఈ విషయంలో సమస్య ఎప్పుడూ లేదని ఆయన వివరణ ఇచ్చారు. ‘నాకు తెలిసి ఇందులో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోలేదు. ఒకసారి శాస్త్రి హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాక తనతో కలిసి పని చేసే వ్యక్తులను ఎంచుకునే హక్కు ఆయనకు ఉంది’ అని చౌదరి అన్నారు.

నేను మాత్రం వెళ్లను...
భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించి ద్రవిడ్, జహీర్‌ పాత్ర ఏమిటో, వారి బాధ్యతలు ఎలాంటివో స్పష్టత లేదు. వీరిద్దరు సలహాదారులుగా ఉంటారని మాత్రం చౌదరి అన్నారు. అయితే తాను విదేశీ పర్యటనలకు వెళ్లనని ద్రవిడ్‌ ఇప్పటికే బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. భారత్‌లో జరిగే ఏదైనా శిక్షణా శిబిరానికి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు, తన అనుభవాన్ని పంచుకునేందుకు మాత్రం సిద్ధమని చెప్పినట్లు తెలిసింది.

వారిద్దరి సలహాలు తీసుకుంటా!
తాను అనుకున్న రీతిలోనే సహాయక సిబ్బందిని ఎంపిక చేయడం పట్ల రవిశాస్త్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను ఇంగ్లండ్‌లో వింబుల్డన్‌ చూస్తున్నా, నా మనసులో ఇతర కోచింగ్‌ సిబ్బంది గురించి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. నేను కోరుకున్న వ్యక్తులనే ఇప్పుడు మీరు చూస్తున్నారు’ అని ఆయన మీడియాతో చెప్పారు. జహీర్, ద్రవిడ్‌ల సూచనలు తీసుకునేందుకు కూడా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘నేను వారిద్దరితో విడివిడిగా మాట్లాడాను. వారు అద్భుతమైన క్రికెటర్లు. వారిచ్చే సూచనలు వెల కట్టలేనివి. సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత వారు కూడా మా బృందంలో భాగమవుతారు’ అని శాస్త్రి అన్నారు. భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా పని చేయడం గొప్ప గౌరవమని, తనకు ఆ అర్హత ఉందని భావించి తనను ఎంపిక చేసిన సలహాదారుల కమిటీకి శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు.

రూ. 8 కోట్ల వేతనం!
భారత జట్టు హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రికి ఏడాదికి రూ. 8 కోట్ల వరకు వేతనంగా చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. గత కోచ్‌ కుంబ్లేకు (రూ. 6.5 కోట్లు) ఇచ్చిన దానికంటే ఇది మరింత ఎక్కువ కావడం విశేషం. దీనిపై బోర్డులోని ప్రముఖుడు ఒకరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిసింది. భరత్‌ అరుణ్, సంజయ్‌ బంగర్, శ్రీధర్‌లకు రూ. 2–3 కోట్ల మధ్య దక్కే అవకాశం ఉంది.  

భరత్‌ అరుణ్‌ ప్రొఫైల్‌
విజయవాడలో పుట్టిన ఈ మాజీ పేస్‌ బౌలర్‌ తమిళనాడు తరఫున ఆడారు. భారత్‌కు కేవలం 2 టెస్టులు (4 వికెట్లు), 4 వన్డేల్లో (1వికెట్‌) మాత్రమే ప్రాతినిధ్యం వహించిన అరుణ్‌కు దేశవాళీ క్రికెట్‌లో మాత్రం మెరుగైన రికార్డు ఉంది. భారత బౌలింగ్‌ కోచ్‌గా మంచి ఫలితాలు సాధించిన ఆయన, గత ఏడాది హైదరాబాద్‌ రంజీ టీమ్‌ కోచ్‌గా కూడా పని చేసి జట్టును నాకౌట్‌ దశకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. అండర్‌–19 స్థాయి నుంచి రవిశాస్త్రితో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనకు మరోసారి కీలక అవకాశం కల్పించింది.

>
మరిన్ని వార్తలు