అంతా నాన్సెన్స్‌ : రవిశాస్త్రి

30 Jul, 2019 09:39 IST|Sakshi
రవిశాస్త్రి

ముంబై : జట్టులో విభేదాలు అంటూ చేస్తున్న ప్రచారమంతా నాన్సెన్స్‌ అని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొట్టిపారేశాడు. ప్రపంచకప్‌ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల మధ్య విభేదాలు తలెత్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించాడు. క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేస్తున్నారనే వార్తలు కూడా త్వరలో చదువుతారని, పరస్థితి ఆస్థాయికి దిగజారిందన్నాడు. వీండిస్‌ పర్యటనకు బయల్దేరేముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్‌ కోహ్లితో కలిసి రవిశాస్త్రి మాట్లాడాడు.

‘జట్టులో ఆటకన్నా ఎవరు గొప్ప కాదు. అది కెప్టెన్‌ విరాట్ అయినా‌, నేనైనా.. ఇంకెవరైనా అందరం జట్టుకోసమే ఆలోచించేవాళ్లమే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా, ఇన్నేళ్లు ఏ జట్టు రాణించేది కాదు. డ్రెస్సింగ్‌ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా జట్టులో ఎలాంటి విభేదాలు లేవు’ అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. అయితే ప్రపంచకప్‌ గెలవాల్సిందని కానీ దురదృష్టవశాత్తు చేజారిందన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ప్రారంభ 30 నిమిషాలు ఎంతో గుణపాఠాన్ని నేర్పిందని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం జట్టులో అంతా బాగుందని, ఎవరో కావాలని ఇలాంటివి పుట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. కోచ్‌గా రవిశాస్త్రికే తన ఓటని అతనితో ఉన్న అనుబంధాన్ని కోహ్లి మరోసారి ప్రదర్శించాడు. ‘కోచ్‌ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేశాడు. విండీస్‌ పర్యటనలో భాగంగా కోహ్లిసేన ఆగస్టు 3,4న రెండు టీ20లు, 8 నుంచి 14 మధ్య మూడు వన్డేలు, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్‌ 3 మధ్య రెండు టెస్ట్‌లు ఆడనుంది.

మరిన్ని వార్తలు