అది మార్కెట్లో దొరికే సరుకు కాదు: రవిశాస్త్రి

11 Sep, 2019 16:23 IST|Sakshi

న్యూఢిల్లీ : అనుభమనేది మార్కెట్‌లో దొరికే సరుకు కాదని..దానిని ఎవరూ అమ్మడం గానీ కొనడం గానీ చేయలేరని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. నాలుగు దశాబ్దాలుగా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని.. ఇప్పుడు తాను ఉన్న స్థాయికి చేరుకోవడానికి అనుభవమే ఉపయోగపడిందని చెప్పుకొచ్చాడు. 2017 నుంచి జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి మరోసారి ఆ పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్‌ 2021 వరకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సన్నిహితుడైన రవిశాస్త్రికి మరోసారి కోచ్‌గా అవకాశం రావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. 

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి గల్ఫ్‌ న్యూస్‌తో మాట్లాడుతూ...‘ నన్ను నేను జడ్జ్‌ చేసుకోవడానికి ఇష్టపడను. నలభై ఏళ్లుగా ఆటలో భాగస్వామినై ఉన్నాను. 17 ఏళ్ల వయసులో ముంబై తరఫున ఆడాను. మరుసటి ఏడాదికే ఇండియాకు ఆడాను. అప్పటి నుంచి ఒక్క సీజన్‌ కూడా క్రికెట్‌కు దూరం కాలేదు. బ్రాడ్‌కాస్టర్‌గా, డైరెక్టర్‌గా, కోచ్‌గా టీమిండియాతో పాటు నా ప్రయాణం కొనసాగుతోంది. అందుకే ఆటను దగ్గరగా చూసే అవకాశం నాకు దక్కింది. తద్వారా యాజమాన్యపు లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నాకు ఒంటబట్టాయి. ఆ అనుభవం కచ్చితంగా పనికివస్తుంది. నాతో పాటు భరత్‌ అరుణ్‌, ఆర్‌ శ్రీధర్‌కు కూడా జట్టుతో మంచి అనుబంధం ఉంది. జట్టును మేటిగా నిలిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా జట్టు విజయ పరంపర కొనసాగేందుకు దోహదపడుతుంది’ అని పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా