అసూయతోనే ధోనిపై విమర్శలు..

10 Nov, 2017 10:21 IST|Sakshi

టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి

సాక్షి, కోల్‌కతా: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని లెజెండ్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై వస్తున్న విమర్శలను తప్పుబడుతూ..ఇప్పటికే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌, మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌లు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా వీరి సరసన చేరాడు. అసూయతోనే ధోనిపై కొంతమంది పనిగట్టుకోని విమర్శలు చేస్తున్నారని రవిశాస్త్రి మండిపడ్డారు.

వారంతా కుళ్లు.. కుతంత్రాలతో ధోని నాశనం కోసం ఎదురుచూస్తున్నారని ఓ బెంగాళీ స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నారు.  ‘కానీ ధోని ఓ దిగ్గజం. అతని కెరీర్‌ ఎలా మలుచుకోవాలో అతనికి బాగా తెలుసు. భారత జట్టులో ఓ కొత్త ధోనిగా అవతారమెత్తి అద్భుతంగా రాణిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ధోని ఓ గొప్ప నాయకుడు. ఇప్పుడు ఓ అల్టిమెట్‌ టీం మెంబర్‌. ప్రతి సారి నన్ను టీవీ షోలో ప్రశ్నించే ప్రశ్నలు ఇవే ధోనిని టీ20ల నుంచి తప్పుకోవాలని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు, దీనీపై మీ స్పందన ఏమిటి అని. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే. ధోని ఒక సూపర్‌ స్టార్‌.. అతనో ఓ అద్బుతమై ఆటగాడు కాబట్టే టీవీ చానళ్లు ధోని సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సంచలనం చేస్తున్నాయి. ధోని 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తన వన్డే యావరేజ్‌ 60కి తగ్గలేదని, గత శ్రీలంక, ఆస్ట్రేలియాల సిరీస్‌ల్లో మ్యాచ్‌లను  గెలిపించిన సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు’.

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని నెమ్మది బ్యాటింగ్‌ను ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, అజిత్‌ అగార్కర్‌, ఆకాశ్‌ చోప్రాలు టీ20ల నుంచి తప్పుకొని కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ధోనిని విమర్శించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు