'బాధపడొద్దు మీ ప్రదర్శన గర్వించదగినది'

12 Jul, 2019 13:19 IST|Sakshi

టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమిండియా న్యూజీలాండ్‌ చేతిలో ఓడిపోవడం తనకు భాద కలిగించినా, మా కుర్రాళ్లు చేసిన ప్రదర్శన నన్ను ఆకట్టుకుందని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. బుధవారం కివీస్‌తో మ్యాచ్‌ ముగిసిన తర్వాత రవిశాస్త్రి డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లతో సమావేశమయ్యారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ 5 సెంచరీలు చేయడం, కోహ్లి ,రాహుల్‌లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం అభినందించదగ్గ విషయం. అలాగే సెమీఫైనల్లో ప్రతికూల పరిస్థితుల్లో మహీ-జడేజాలు నెలకొల్పిన 116 పరుగుల కీలక భాగప్వామ్యం క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని రవిశాస్రి స్పష్టం చేశారు.

'మీరు మ్యాచ్‌లో ఓడిపోయారు కానీ అభిమానుల మనసులు గెలుచుకున్నారని ఆటగాళ్లలో స్పూర్తి నింపారు. మనం ఈ ప్రపంచకప్‌లో రెండో ర్యాంకుతో అడుగుపెట్టామని, లీగ్‌ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ మినహా మిగతా జట్లపై విజయాలు సాధించి అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టామన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సెమీస్‌లో న్యూజీలాండ్‌ విధించిన 240 పరుగుల లక్ష్యాన్ని ప్రతికూల పరిస్థితుల్లో చేదించలేకపోయామే తప్ప మీ ఆటను తప్పు పట్టనవసరంలేదని' శాస్త్రి తెలిపాడు.అంతేగాక గత రెండేళ్లలో జట్టుగా మనం ఎన్నో విజయాలు సాధించామన్న విషయం గుర్తుంచుకోండి. సెమీస్‌ మ్యాచ్‌లో కేవలం 30 నిమిషాల చెత్త ఆట మన విజయాలని చెరిపేయలేదని రవిశాస్రి ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. 

టీమిండియా తమ తదుపరి షెడ్యూల్‌లో భాగంగా ఆగస్టులో వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో మూడు టి20లు, 3 వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొననుంది. అయితే కెప్టెన్‌ ​విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. అదేవిధంగా ప్రపంచకప్‌లో జట్టు నిష్క్రమణ తర్వాత ఎమ్మెస్‌ ధోని రిటైర్మంట్‌పై ఊహాగానాలు ఇంకా అలాగే మిగిలి ఉన్నాయి.

మరిన్ని వార్తలు