‘ఇక రవిశాస్త్రిని తొలగించండి’

17 Sep, 2018 10:58 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిని తొలగించాలని మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ డిమాండ్‌ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందే అతడిని పదవి నుంచి తొలగిస్తే మంచిదన్నాడు.  ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌ ఘోర పరాజయం కావడంతో రవిశాస్త్రిపై విమర్శలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి పని తీరును టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన చేతన్‌ చౌహాన్‌..‘ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌ బాధ్యతల నుంచి తొలగించాలి. శాస్త్రి అద్భుత క్రికెట్‌ వ్యాఖ్యాత. అతడిని ఆ పని చేసేందుకే అనుమతించాలి’ అని సూచించారు.

ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లి సేన మెరుగైన ఆట తీరును కనబరచడంలో విఫలమైందన్నాడు. రెండు జట్లు బలాబలాల్లో సమానంగా ఉన్నా ఇంగ్లండ్‌ టెయిలెండర్లను ఔట్‌ చేయడంలో టీమిండియా విఫలమైందన్నారు. భారత క్రికెట్‌ జట్లలో కోహ్లి సేన అత్యుత్తమం అన్న రవిశాస్త్రి మాటలను చేతన్‌ వ్యతిరేకించాడు. ‘దాన్ని నేను అంగీకరించను. 1980ల్లోని భారత జట్టే ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టు’ అని చౌహాన్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు