ముందే అనుకున్నా ఆసాంతం ఆడాలని...

15 Dec, 2017 00:29 IST|Sakshi

రోహిత్‌ శర్మ... మూడో డబుల్‌ సెంచరీతో మరో సంచలన ఇన్నింగ్స్‌కు తెరతీసిన భారత ఓపెనర్‌. నాయకుడిగా తొలి మ్యాచ్‌లోనే ఎదురైన చిత్తు ఫలితంతో నీరుగారిపోలేదు. ఓపిగ్గా ఆడటంపైనే దృష్టి పెట్టాడు. దీంతో మరో మ్యాచ్‌ మొదలయ్యేసరికే అసాధారణ ప్రదర్శనకు కేంద్రబిందువయ్యాడు.  

మొహాలీ: సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవాలనే లక్ష్యంతోనే బ్యాటింగ్‌ ప్రారంభించానన్నాడు భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌ చరిత్రలో మూడో డబుల్‌ సెంచరీ బాదిన బ్యాట్స్‌మన్‌గా పుటల్లోకి ఎక్కాడు. రెండో వన్డేలో డబుల్‌ సెంచరీ చేసిన ఈ ఓపెనర్‌ మ్యాచ్‌ ముగిశాక బీసీసీఐ.టీవి వెబ్‌సైట్‌ కోసం హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అద్భుతమైన బ్యాటింగ్‌ను ఇలా చెప్పుకొచ్చాడు.

వికెట్‌ను పారేసుకోవద్దనుకున్నా...
అంత తేలిగ్గా వికెట్‌ను పారేసుకోవద్దని అనుకున్నా. క్రీజ్‌ నుంచి నిష్క్రమించొద్దని గట్టిగా నిర్ణయించుకున్నా. సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడాలని స్వయంగా నిర్దేశించుకున్నాను. ముందుగా నిలదొక్కుకుంటే పిచ్‌నుంచి ఎదురయ్యే సవాల్‌ను అధిగమించవచ్చని ధావన్‌తో చెప్పాను.

ఆరంభమే కీలకం...
పిచ్‌ పరిస్థితుల దృష్ట్యా ఆరంభ ఓవర్లే కీలకమనిపించింది. క్రీజులో పాతుకుపోతే... మిగతా పని సులువవుతుందని ఓపెనర్లిద్దరం భావించాం. భారీ ఇన్నింగ్స్‌కు భాగస్వామ్యాలెంత మేలు చేస్తాయో తెలుసు కాబట్టే అంత తేలిగ్గా షాట్లను ఎంచుకోలేదు.   

209, 264, 208... అన్నీ విలువైనవే...
నా మూడు ద్విశతకాల్లో ఏది ఎక్కువ ఇష్టమంటే చెప్పటం కష్టం. ఈ మూడు నేను క్లిష్టమైన సందర్భాల్లోనే చేశాను. సిరీస్‌ ఫలితాన్ని తేల్చే నిర్ణాయక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై (209) సాధించా. అలాగే గాయం నుంచి కోలుకోగానే పరుగులు చేస్తానో లేదో అనే సందిగ్ధస్థితిలో లంకపై (264) సత్తా చాటుకున్నా. ఇక ఇప్పుడు... సిరీస్‌లో చెత్తగా, చిత్తుగా వెనుకబడిన దశలో చేశా. దీంతో ఇవన్నీ నాకు ప్రత్యేకమైనవే.

నేను ధోనిని కాదు... గేల్‌నూ కాదు
‘నాకు తెలుసు నేనేమీ ధోనిని, గేల్‌ను కాదని. వాళ్లంత పవర్‌ నాలో లేదని. నేను నమ్ముకుంది టైమింగ్‌నే. ఓపిగ్గా బంతి కోసం కాచుకున్నా. చెత్త బంతిపైనే చెలరేగా. వాళ్లయితే ఏ బంతినైనా అలవోకగా బాదేస్తారు. నా కోచ్‌ శంకర్‌ బసు నా పాత్రకు తగ్గట్లు నన్ను తయారు చేశారు. అయనకు థ్యాంక్స్‌. 

మరిన్ని వార్తలు