ఇక సరదా సరదానే: ఉమేశ్

20 Jul, 2017 12:44 IST|Sakshi
ఇక సరదా సరదానే: ఉమేశ్

కొలంబో: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ లు ఎంపికతో జట్టులో సరదా సరదా వాతావరణాన్ని మరొకసారి చూడబోతున్నట్లు ప్రధాన పేసర్ ఉమేశ్ యాదవ్ పేర్కొన్నాడు.  గతంలో వారితో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకున్న ఉమేశ్.. ఇక భారత జట్టులో అంతా ఆహ్లాదకర వాతావరణం ఉండబోతుందన్నాడు. అంతకుముందు అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపిన ఉమేశ్.. ఎవరు కోచ్ గా వచ్చినా తన శక్తి మేరకు రాణించడానికే యత్నిస్తానని పేర్కొన్నాడు. శ్రీలంక పర్యటనకు బయల్దేరే ముందు ఇండియా టుడేతో మాట్లాడిన ఉమేశ్.. రవిశాస్త్రి, భరత్ అరుణ్ లు పునరాగమనాన్ని జట్టు సభ్యులంతా స్వాగతిస్తున్నట్లు తెలిపాడు.

'ఈ కోచింగ్ స్టాఫ్ తో గతంలో నేను పని చేశాను.వారి వర్కింగ్ ప్రాసెస్ ఏమిటో మాకు బాగా తెలుసు. ప్రత్యేకంగా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరి వ్యూహాలపై మాకు చక్కటి అవగాహన ఉంది. రవిశాస్త్రి, భరత్ అరుణ్ లు సరదా అయిన మనుషులు. వారిద్దరి రాకతో శ్రీలంక పర్యటన సరదా సరదాగానే ఉండబోతుంది'అని ఉమేశ్ అభిప్రాయపడ్డాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేల సిరీస్‌ కోసం బుధవారం భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. ఈ నెల 26 నుంచి భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు జరుగుతుంది.

>
మరిన్ని వార్తలు