‘రవిశాస్త్రి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి’

3 Oct, 2019 12:38 IST|Sakshi

న్యూఢిల్లీ:  దాదాపు మూడేళ్ల క్రితం టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే బాధ్యతలు స్వీకరించినప్పుడు రవిశాస్త్రి బాహబాటంగానే మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీపై విరుచుకుపడ్డాడు. అప్పటి క్రికెట్‌ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీనే తనకు కోచ్‌గా పదవి రాకపోవడానికి కారణమంటూ మండిపడ్డాడు. అది అప్పట్లో వీరిద్దరి మధ్య పెద్ద వివాదానికే దారి తీసింది. అయితే ఏడాది వ్యవధిలోనే అనిల్‌ కుంబ్లేతో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విభేదాలు రావడంతో మళ్లీ కోచ్‌ దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానించింది. అప్పుడు రవిశాస్త్రికి మద్దతుగా నిలిచాడు గంగూలీ.

ఇటీవల మరొకసారి టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమించబడ్డ రవిశాస్త్రి అందుకు తగినవాడంటూ గంగూలీ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.‘ భారత్‌ క్రికెట్‌ కోచ్‌గా రవిశాస్త్రి సరైన వ్యక్తే. కానీ అతనిపై పెట్టిన నమ్మకాన్ని రవిశాస్త్రి నిలబెట్టుకోవాలి. వచ్చే రెండేళ్ల కాలంలో రెండు టీ20 వరల్డ్‌కప్‌లు ఉన్న తరుణంలో కనీసం ఒక వరల్డ్‌కప్‌ను గెలిస్తే రవిశాస్త్రిపై నమ్మకం పెరుగుతుంది. రవిశాస్త్రిని కోచ్‌గా నియమించే క్రమంలో బోర్డు కూడా మిగతా ఆప్షన్లను పెద్దగా పరిగణించలేదు. ఇప్పటికే రవిశాస్త్రి ఐదేళ్ల నుంచి భారత జట్టుతో ఉన్నాడు. మరో రెండేళ్లకు అతనికి బాధ్యతలు అప్పచెప్పారు. నాకు తెలిసినంత వరకూ ఇంతటి సుదీర్ఘంగా ఎవరూ కోచ్‌గా చేసిన దాఖలాలు లేవు. రవిశాస్త్రి చాలా నమ్మకం ఉంచే అతనికి కోచింగ్‌ బాధ్యతల్ని కట్టబెట్టారు. ఇక రవిశాస్త్రి దాన్ని అందుకోవడానికి యత్నించాలి’ అని గంగూలీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు