కరణ్‌ షోకు తప్పకుండా వెళ్తా : అశ్విన్

9 Mar, 2019 17:45 IST|Sakshi

కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొని టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కొన్నాళ్లు నిషేధం ఎదుర్కొన్న ఈ ఆటగాళ్లు కన్ను లొట్టబోయి చావు తప్పిన చందంగా అనేక పరిణామాల అనంతరం బయటపడ్డారు. ఇక ఈ వివాదం తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పలు మ్యాచుల్లో రాణించి పునరాగమనంలో సత్తా చాటగా.. రాహుల్‌ కాస్త తడబడినప్పటికీ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఒకానొక సమయంలో ఆటగాళ్ల కెరీర్‌ ప్రమాదంలో పడినప్పటికీ... కరణ్‌ షో మాత్రం అంతర్జాతీయంగా మరింతగా పాపులర్‌ అయింది.

ఈ క్రమంలో కాఫీ విత్‌ కరణ్‌ షోకు వెళ్లేందుకు మరే ఇతర క్రికెటర్లు వెళ్లరనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో ‘ఆస్క్‌ మీ క్వశ్చన్‌’లో భాగంగా టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్ర అశ్విన్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కాఫీ విత్‌ కరణ్‌ షోకు మీరు వెళ్తారా అని అభిమాని అడుగగా.. ‘తప్పకుండా’ అంటూ అశ్విన్‌ సమాధానమిచ్చాడు. అయినా షోకు వెళ్లినంత మాత్రాన వచ్చే నష్టమేమీ ఉండదు.. హద్దుల్లో ఉంటే చాలు అనే ఫార్ములాను అనుసరించి అశ్విన్‌ ఇలా రెస్పాండ్‌ అయ్యాడేమో! (పాండ్యా, రాహుల్‌లపై వేటు)

కాగా గాయాల బారిన పడి కీలక మ్యాచ్‌లకు దూరమైన అశ్విన్‌.. చివరిసారిగా అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, చహల్‌లు విశేషంగా రాణిస్తుండటంతో జట్టులో స్థానం కోసం ప్రధాన స్పిన్నర్‌ అశ్విన్‌ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు