ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దాడిని ఖండించిన అశ్విన్‌

11 Oct, 2017 14:55 IST|Sakshi

గువాహటి : ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై దాడిని టీమిండియా ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఖండించాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. ఇటువంటి చర్యలతో దేశానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించాడు. ‘ఆసీస్‌ క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు విసరడం మంచిపని కాదు. ఇలాంటి పనులు దేశానికి అపకీర్తి తెచ్చిపెడతాయి. మనమంతా బాధ్యతాయుతంగా ఉండాల’ని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు.

గువాహటిలో రెండో టీ20 మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి హోటల్‌కు వెళ్తున్న ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రాయి విసిరారు. క్రికెట్‌ బంతి పరిమాణంలో ఉన్న రాయిని విసరడంతో  బస్సు కుడివైపు అద్దం ధ్వంసమైంది. ఎవరికి గాయాలు అయినట్టు సమాచారం లేదు.

ఈ ఘటనపై అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ క్షమాపణ చెప్పారు. తమ రాష్ట్ర ప్రజలు ఇటువంటి దుశ్చర్యలను సహించబోరని, దోషులను శిక్షిస్తామని అన్నారు. ఆసీస్‌ క్రికెటర్ల బస్సుపై దాడిని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ కూడా ఖండించారు. భద్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు