ఏం నాయనా.. మీకు కనిపించడం లేదా?: అశ్విన్‌

16 Mar, 2020 16:45 IST|Sakshi

చెన్నై: కరోనా వైరస్‌ తీవ్రత ప్రపంచాన్ని వణికుస్తున్నప్పటికీ చెన్నై వాసులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అసహనం వ్యక్తం చేశాడు. కరోనాతో ఏం కాదనే భావనలో చెన్నై వాసులు ఉన్నారేమో అని అశ్విన్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలనే విషయం ఇప్పటికీ చెన్నై వాసుల దృష్టికి వచ్చినట్లు అనిపించడం లేదు. వేసవి వల్ల కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందనే భావనలో వారు ఉన్నారేమో. లేదా మాకేం కాదులే అనే ధీమాతోనైనా ఉండాలి' అని అశ్విన్‌ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.(కోవిడ్‌ కేసులు 107)

దేశంలో కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా కలిసుండరాదని, సభలు, సమావేశాల్లో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో ఇప్పటివరకు 110 వైరస్‌ కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతిచెందారు. తమిళనాడులో కూడా కరోనా కేసు నమోదైంది. సోషల్ మీడియాలో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కేఎల్‌ రాహుల్, వీవీఎస్ లక్ష్మణ్, సానియా మీర్జా వంటి పలువురు క్రీడాకారులు ముందుకు వచ్చారు. అందరం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిద్దామని వీరు పిలుపునిచ్చారు.(కరోనా లక్షణాలు దాస్తే 6నెలల జైలు శిక్ష)

>
మరిన్ని వార్తలు