అత్యుత్తమ స్పిన్నర్‌ అతనే:మురళీ

28 Nov, 2017 15:29 IST|Sakshi

కొలంబో:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో విశేషంగా రాణించి ఎనిమిది వికెట్లు సాధించడంతో పాటు మూడొందల వికెట్ల మైలురాయిని వేగవంతంగా పూర్తి చేసిన భారత స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌పై దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌ ఎవరైనా ఉన్నారంటే అది అశ్వినేనని కొనియాడాడు. ముందుగా అరుదైన ఫీట్‌ను సాధించిన అశ్విన్‌కు అభినందనలు తెలిపిన మురళీ.. మూడొందల టెస్టు వికెట్లను తీయడమంటే అంత తేలికైన విషయం కాదన్నాడు.

కచ‍్చితంగా ఈతరం ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్వినే ముందువరుసలో ఉన్నాడనడానికి అతని ప్రదర్శనే కొలమానంగా పేర్కొన్నాడు.  ఇంకా నాలుగైదేళ్లు క్రికెట్‌ ఆడే సత్తా ఉన్న అశ్విన్‌ మరిన్నిరికార్డులను సాధిస్తాడని మురళీ జోస్యం చెప్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ‌(అశ్విన్‌కు 54వ టెస్టు మ్యాచ్‌)లో 300 వికెట్లు తీసి.. అత్యంత వేగవంతంగా ఈ రికార్డు సాధించిన బౌలర్‌గా అశ్విన్‌ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ మాజీ పేసర్‌ డెన్నిస్‌లిల్లీ(56 టెస్టు మ్యాచ్‌లు) సాధించిన రికార్డును అశ్విన్‌ సవరించాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా