42 ఏళ్ల తర్వాత మనోళ్లు సాధించారు

31 Dec, 2016 20:37 IST|Sakshi
42 ఏళ్ల తర్వాత మనోళ్లు సాధించారు

ముంబై: భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు 2016 బాగా కలసి వచ్చింది. టెస్టు క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన వీరిద్దరూ ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌ జాబితాలో అశ్విన్‌, జడేజా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి 2016కు గుడ్‌ బై చెప్పారు. 42 ఏళ్ల తర్వాత టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు తొలి రెండు స్థానాలను సాధించడమిదే తొలిసారి. 1974లో భారత బౌలర్లు బిషన్‌ సింగ్ బేడీ, భగవత్‌ చంద్రశేఖర్ తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారని ఐసీసీ పేర్కొంది.

ఇక ఆల్‌రౌండర్ల జాబితాలోనూ అశ్విన్‌ టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. జడేజా మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌లతో జరిగిన టెస్టుల సిరీస్‌లలో ఈ జోడీ కీలక పాత్ర పోషించింది. అలాగే కీలక సమయాల్లో బ్యాటింగ్‌లో కూడా రాణించారు. టీమ్‌ ర్యాంకింగ్స్లో భారత్ 120 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 105 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బ్యాట్స్మెన్ జాబితాలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు