ఆ వార్తతో అశ్విన్‌ పరేషాన్‌!

27 May, 2019 14:41 IST|Sakshi

జయసూర్య మరణవార్తపై ఆరాతీసిన భారత స్పిన్నర్‌

చెన్నై : శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య మరణించాడంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పరేషాన్‌ అయ్యాడు. కెనడాలో సనత్‌ జయసూర్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో జయసూర్య మరణించాడంటూ గత వారం రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వార్తను చూసిన అశ్విన్‌ షాక్‌ గురయ్యాడు. ఇది నిజమేనా అంటూ ట్విటర్‌ వేదికగా ఆరా తీశాడు. ‘జయసూర్యకు సంబంధించిన వార్త నిజమేనా? నాకు వాట్సాప్‌లో అప్‌డేట్‌ వచ్చింది. కానీ ట్విటర్‌లో ఎక్కడా కనిపించలేదు.’ అని అమాయకంగా ట్వీట్‌ చేశాడు. అది నకిలీ వార్త అంటూ చాలా మంది అభిమానులు అశ్విన్‌కు రిప్లే ఇచ్చారు. ఓ అభిమాని అయితే ఈ వార్తను జయసూర్య కూడా ఖండించాడంటూ దానికి సంబంధించిన ట్వీట్‌ను అశ్విన్‌కు పంపించాడు.

‘నేను మరణించానని, నా ఆరోగ్యం బాలేదని కొన్ని ద్వేశపూరిత వెబ్‌సైట్లు అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నాయి. దయచేసి వాటిని ఎవరు పట్టించుకోవద్దు. నేను ప్రస్తుతం శ్రీలంకలోనే ఉన్నాను. ఇటీవల నేనెప్పుడూ కెనడాను సందర్శించలేదు. దయచేసి ఈ ఫేక్‌ న్యూస్‌ షేర్‌ చేయడం నివారించండి’ అని జయసూర్య ట్వీటర్‌లో అర్ధించారు. ఇక సెలబ్రిటీల విషయంలో తప్పుడు కథనాలు సృష్టించడం కొత్త విషయం కాకపోగా.. వాట్సాప్‌లో నకిలీ వార్తలు వ్యాప్తికి ఎంత అడ్డుకట్ట వేసినా ఆగడం లేదు. క్రికెటర్‌ అశ్విన్‌కే తప్పుడు వార్త అప్‌డేట్‌ వచ్చిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మన్‌ అయిన జయసూర్య.. శ్రీలంక తరఫున వన్డేల్లో 13,430 పరుగులుతో పాటు 368 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా ఆ జట్టు 1996 ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ అవార్డును అందుకున్నాడు. 2007లో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ఈ శ్రీలంక మాజీ కెప్టెన్‌.. 2011లో పొట్టిఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాదే క్రికెట్‌ సంబంధించిన వ్యవహారాల్లో పాలుపంచుకోవద్దని ఐసీసీ రెండేళ్లవరకు అతనిపై నిషేదం విధించింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో జరిగిన అవకతవకలపై జయసూర్య విచారణకు సహకరించకపోవడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది.

మరిన్ని వార్తలు