రవీందర్‌కు రజతం

31 Oct, 2019 13:49 IST|Sakshi

బుడాపెస్ట్‌ (హంగేరి): ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్‌ రవీందర్‌ రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. బుధవారం జరిగిన పురుషుల 61 కేజీల ఫ్రీస్టయిల్‌ ఫైనల్లో రవీందర్‌ 3–5 పాయింట్ల తేడాతో ఉలుక్‌బెక్‌ జోల్‌డోష్‌బెకోవ్‌ (కిర్గిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. మూడు నిమిషాల తొలి రౌండ్‌ ముగిశాక 1–0తో ఆధిక్యంలో నిలిచిన రవీందర్‌ మరో మూడు నిమిషాల నిడివిగల రెండో రౌండ్‌లో మాత్రం తడబడ్డాడు.

బౌట్‌ ముగియడానికి రెండు నిమిషాల సమయం ఉందనగా ఉలుక్‌బెక్‌ ఇంజ్యూరీ టైమ్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఉలుక్‌బెక్‌ రెండు మూవ్‌మెంట్స్‌తో నాలుగు పాయింట్లు సంపాదించి 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరి సెకన్లలో రవీందర్‌ తేరుకున్నా అప్పటికే ఆలస్యమై పోయింది.  ఇదే టోర్నీ మహిళల 50 కేజీల విభాగంలో భారత రెజ్లర్‌ జ్యోతి కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో జ్యోతి 4–15తో కికా కగాటా (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.ప్రపంచ అండర్‌–23 రెజ్లింగ్‌ టోర్నీలో భారత్‌కు ఓవరాల్‌గా లభించిన పతకాలు. ఈ ఐదూ రజతాలే  కావడం గమనార్హం. గతంలో బజరంగ్, వినోద్‌ కుమార్, రీతూ ఫొగాట్‌ (2017లో), రవి దహియా (2018లో) రజత పతకాలు నెగ్గారు.

>
మరిన్ని వార్తలు