జడేజాకు బీసీసీఐ నో పర్మిషన్‌..!

6 Mar, 2020 12:05 IST|Sakshi

ఎందుకు అనుమతి ఇవ్వరు..

క్రికెట్‌ బోర్డును నిలదీసిన ఎస్‌సీఏ ప్రెసిడెంట్‌

రాజ్‌కోట్‌:  రంజీ ట్రోఫీ ఫైనల్లో తమ స్టార్‌ ఆటగాడు రవీంద్ర జడేజా ఆడటానికి అనుమతి ఇవ్వాలన్న సౌరాష్ట్ర అభ్యర్థనను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తిరస్కరించింది. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో జడేజా ఆడటానికి అనుమతించాలని సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) కోరింది. కాగా, దీన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తిరస్కరించారు. దేశానికి ఆడటమే తొలి ప్రాధాన్యత పాలసీ కింద జడేజాను రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడటానికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై సౌరాష్ట​ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జయదేవ్‌ షా అసహనం వ్యక్తం చేశారు. కనీసం స్టార్‌ ఆటగాళ్లను రంజీ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడటానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. 

‘ జడేజాను సౌరాష్ట్ర జట్టులో తీసుకోవడానికి బీసీసీఐ పర్మిషన్‌ కోరా. కానీ గంగూలీ దాన్ని తిరస్కరించాడు. ‘కంట్రీ ఫస్ట్‌ పాలసీ’ కింద జడేజా రంజీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడటానికి అనమతి ఇవ్వలేదు. రంజీ ట్రోఫీ ఫైనల్‌ జరిగేటప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు అనేవి ఉండకూడదు. దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ అధిక ప్రాధాన్యత ఇస్తే అప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండకూడదు. రంజీ ట్రోఫీ ఫైనల్‌ జరిగే సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌ ఉంది. నేను బీసీసీఐని ఒకటే అడగదల్చుకున్నా. ఐపీఎల్‌ జరిగేటప్పుడు ఏమైనా అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారా. అది డబ్బును తెచ్చిపెడుతుంది కాబట్టి అప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు పెట్టడం లేదు. స్టార్‌ ఆటగాళ్లు ఉన్నప్పుడే రంజీ ట్రోఫీ మరింత ఫేమస్‌ అవుతుంది. కనీసం ఫైనల్స్‌లోనైనా స్టార్‌ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వండి. రంజీ ఫైనల్స్‌ జరిగేటప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు షెడ్యూల్‌లో ఉండకూడదు’ అని షా సూచించారు. తమ జట్టు తరఫున ఆడటానికి జడేజాని కోరుతున్నామని, అదే సమయంలో మహ్మద్‌ షమీ బెంగాల్‌ తరఫున ఆడాలని కూడా తాము కోరుకుంటున్నామన్నారు. (21 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేశాడు..)

మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ సౌరాష్ట్ర-బెంగాల్‌ జట్ల మధ్య రాజ్‌కోట్‌ వేదికగా రంజీ ట్రోఫీ ఫైనల్‌ జరుగనుంది. అదే సమయంలో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటించనుంది. మార్చి 12వ తేదీన భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఆ నేపథ్యంలో జడేజా రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. టీమిండియా తరఫున జడేజా కీలక ఆటగాడు కాబట్టి అతనికి రంజీ ఫైనల్స్‌కు అనుమతి లభించలేదు. దీన్నే ప్రశ్నిస్తున్నారు ఎస్‌సీఏ అధ్యక్షుడు జయదేవ్‌ షా. ఆ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్‌ ఏమిటని బీసీసీఐని నిలదీశారు. 

మరిన్ని వార్తలు