నేను బుద్ధిమంతుడిగా మారగానే...

8 Aug, 2017 00:04 IST|Sakshi
నేను బుద్ధిమంతుడిగా మారగానే...

రవీంద్ర జడేజా అసహనం

జామ్‌నగర్‌: ఐసీసీ తనపై ఒక మ్యాచ్‌ నిషేధం విధించడం భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజాను తీవ్రంగా కలచివేసినట్లుంది. రెండో టెస్టు గెలిచాక ‘కలలంటే నిద్రలో వచ్చేవి కాదు. మీకు నిద్ర లేకుండా చేసేవి. కష్టానికి తగిన ప్రతిఫలం’ అంటూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రోఫీతో సహా ట్వీట్‌ చేసి అతను తన ఆనందాన్ని పంచుకున్నాడు. అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే అతనిపై నిషేధం పడింది. దాంతో ఘాటైన వ్యాఖ్యతో తన బాధను కూడా జడేజా ట్విట్టర్‌ ద్వారానే వ్యక్తపరిచాడు.  ‘నేను బుద్ధిమంతుడిలా మారడమే ఆలస్యం. లోకం మొత్తం దుర్మార్గంగా మారిపోయింది’ అని అతను ట్వీట్‌ చేశాడు. జట్టుకు దూరం కావడంతో జడేజా బోర్డు అనుమతితో వెంటనే భారత్‌కు వచ్చేశాడు. తన ఇంట్లో సోదరీమణులతో అతను రాఖీ పండుగ జరుపుకున్నాడు.

ఐసీసీ అతి...
జడేజా నిషేధంపై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ఐసీసీని ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘జడేజాపై నిషేధం విధించే అంశంలో అంపైర్లు, రిఫరీలు అతిగా వ్యవహరించారు. మైదానంలో ఘటనలపై ఐసీసీ కఠినంగా వ్యవహరించడం మంచిదే కానీ ప్రత్యేకంగా జడేజా విషయంలో వారు చాలా ఎక్కువ చేసినట్లు అనిపిస్తోంది’ అని గావస్కర్‌ అన్నారు. 

>
మరిన్ని వార్తలు