ఒక్క మ్యాచే.. బాధపడొద్దు : జడేజా

26 May, 2019 15:35 IST|Sakshi
మీడియాతో జడేజా

లండన్‌ : ప్రపంచకప్‌కు ముందు సన్నాహక సమరాన్ని భారత్‌ పరాజయంతో ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కోహ్లి సేన 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ ఓటమితో భారత అభిమానులు తీవ్ర నిరాశకులోనయ్యారు. ప్రపంచకప్‌ హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు ఆ స్థాయికి తగ్గ ప్రదర్శ కనబర్చకుండా కుదేలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్వింగ్‌ దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టడం మన లొసగులను తెలియజేసింది. ఇక ఈ మ్యాచ్‌లో అందరూ చేతులెత్తేసినా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (50 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. 

ఈ మ్యాచ్‌ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ఒక్క మ్యాచ్‌ ఓటమితో బాధపడవద్దని, ఆటగాళ్లపై ఓ అంచనాకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. ‘ఇది మా తొలి మ్యాచ్. ఒక్క చెత్త ఇన్నింగ్స్‌తో ఆటగాళ్లను జడ్జ్‌ చేయవద్దు. బ్యాటింగ్‌ విభాగం గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంగ్లండ్‌లో ఎప్పుడూ కఠినమే. ఫ్లాట్‌ వికెట్లపై ఆడాలంటే కొంత కుదరురుకోవాలి. దానికి కొంత సమయం పడుతోంది. మేమంతా దానిపైనే కసరత్తులు చేస్తున్నాం. దీనికి బాధపడాల్సిన అవసరమే లేదు. మేం మంచి క్రికెట్‌ ఆడుతాం. బ్యాటింగ్‌ విభాగం నైపుణ్యం కోసం చాలా కష్టపడుతుంది. అంతా అనుభవం ఉన్న ఆటగాళ్లే. ఎవరు అధైర్యపడవద్దు. వార్మప్‌ మ్యాచ్‌ పిచ్‌ ఇంగ్లీష్‌ పరిస్థితులకు అనువైనది. చాలా సాఫ్ట్‌ పిచ్‌. మ్యాచ్‌ సాగే కొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.

ఈ తరహా పిచ్‌లు టోర్నీలో లభించవని మేం భావిస్తున్నాం. నేను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పిచ్‌ అనుకూలించడం ప్రారంభమైంది. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చాలా స్వేచ్చగా ఆడాను. ముందే బ్యాటింగ్‌కు వస్తే నేను కూడా ఔటయ్యేవాడిని. ఇక పిచ్‌ స్వింగ్‌ అనుకూలిస్తుందని, తొలుత బ్యాటింగ్‌ చేస్తే కలిసి వస్తుందని మాకు ముందే తెలుసు. కానీ మేం కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ చేయాలనుకున్నాం. ఏ స్థానంలోనైనా నేను బ్యాటింగ్‌ చేయగలన’ అని జడేజా చెప్పుకొచ్చారు.
 

>
మరిన్ని వార్తలు