‘రాయుడు, పంత్‌లకు అవకాశం ఉంది’

17 Apr, 2019 17:58 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌-వేల్స్‌ వేదికగా జరగబోయే ప్రపంచకప్‌లో పాల్గనబోయే భారత జట్టును తాజాగా సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ జాబితాలో యువ సంచలనం రిషభ్‌ పంత్‌, వెటరన్‌ ఆటగాడు అంబటి రాయుడులకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాయుడు, పంత్‌లతో పాటు నవదీప్‌ సైనీని స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 

‘ఐసీసీ చాంపియన్‌ ట్రోఫీ సందర్బంగా అవలంబించిన పద్దతినే కొనసాగిస్తున్నాం. పంత్‌, రాయుడు, సైనీలను స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా ఎంపిక చేశాం. ప్రస్తుతం జట్టులో ఎవరైన గాయపడితే వారికే తొలి అవకాశం ఇస్తాం. నెట్‌ ప్రాక్టీస్‌లో బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ చేసేందుకు ఖలీల్‌, ఆవేశ్‌ ఖాన్‌, దీపక్‌ చాహర్‌లను ఎంపికచేశాం. ఈ ముగ్గురు బౌలర్లు టీమిండియాతో కలిసి ఇంగ్లండ్‌కు వెళతారు. కానీ వీరు స్టాండ్‌ బై ప్లేయర్స్‌ కాదు’అంటూ బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

సెలక్టర్లు ప్రకటించిన జాబితాలో రాయుడు లేకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందిన మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ పేర్కొన్నాడు. నాలుగో స్థానంలో అనుభవజ్ఞుడైన ఆటగాడు ఉంటే కోహ్లి సేనకు ఎంతో ఉపయోగపడేదని వివరించాడు. ఇక మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా ప్రపంచకప్‌కు రాయుడును ఎంపిక చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు