ముంబైకి మళ్లీ పొ‘లార్డ్’

12 May, 2016 05:55 IST|Sakshi
ముంబైకి మళ్లీ పొ‘లార్డ్’

బట్లర్ మెరుపు ఇన్నింగ్స్
బెంగళూరుపై ముంబై విజయం
కోహ్లి సేన ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం

 
 
ఐపీఎల్‌లో కీలక సమయంలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ముంబైని గెలిపించే పొలార్డ్ మరోసారి తన విలువను నిరూపించుకున్నాడు. లక్ష్యఛేదన క్లిష్టంగా మారిన సమయంలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లోనే బెంగళూరుతో గత మ్యాచ్‌లో 19 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసి ముంబైని గెలిపించిన పొలార్డ్...

మరోసారి అదే జట్టుపై 19 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి గెలిపించాడు. అటు బెంగళూరు జట్టు కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇకపై అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు అదృష్టం కూడా తోడైతేనే కోహ్లి సేనకు అవకాశాలు ఉంటాయి.

 
 
 
బెంగళూరు: బౌలింగ్ బలహీనంగా ఉన్నా... బ్యాటింగ్ బలంతో ఈ సీజన్‌లో నెట్టుకొస్తున్న బెంగళూరు జట్టును కీలక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ముంచేశారు. బ్యాటింగ్‌కు స్వర్గథామంలాంటి పిచ్‌పై స్టార్ క్రికెటర్లంతా విఫలం కావడంతో కోహ్లి సేన ఓడిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 6 వికెట్లతో బెంగళూరుపై గెలిచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 151 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (53 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సచిన్ బేబీ (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గేల్, కోహ్లి విఫలం కాగా... డివిలియర్స్ (27 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో సౌతీ, మెక్లీనగన్, క్రునాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీసుకున్నారు.  

ముంబై ఇండియన్స్ జట్టు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (47 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... పొలార్డ్ (19 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (11 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్ క్రునాల్ పాండ్యా (1/15)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

 నిలబెట్టిన భాగస్వామ్యం
సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (7) సిక్సర్‌తో ఖాతా తెరిచినా మెక్లీనగన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చిన గేల్ (5) కూడా విఫలమయ్యాడు. దీంతో బెంగళూరు 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లోకేశ్ రాహుల్, డివిలియర్స్ కలిసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నెమ్మదిగా ఆడటంతో పరుగులు రాలేదు. దీంతో బెంగళూరు 10 ఓవర్లలో రెండు వికెట్లకు 60 పరుగులు మాత్రమే చేసింది. 11వ ఓవర్ తొలి బంతికే భారీ షాట్‌కు వెళ్లి డివిలియర్స్ అవుటయ్యాడు. వాట్సన్ కూడా కుదురుకునేందుకు సమయం తీసుకోవడంతో బెంగళూరు 14 ఓవర్లకు 76 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో రాహుల్ వేగం పెంచాడు. మెక్లీనగన్ బౌలింగ్‌లో సిక్సర్, రెండు ఫోర్లు కొట్టాడు. అయితే రెండో ఎండ్‌లో వాట్సన్ రనౌటయ్యాడు. 42 బంతుల్లో రాహుల్ ఈ సీజన్‌లో మూడో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాక... చివరి మూడు ఓవర్లలో చెలరేగి ఆడాడు. రెండో ఎండ్‌లో సచిన్ బేబీ కూడా భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 27 బంతుల్లో 53 పరుగులు జోడించడంతో బెంగళూరుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది.


 ఆదుకున్న పొలార్డ్, బట్లర్
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అరవింద్ బౌలింగ్‌లో పార్థీవ్ అవుట్ కావడంతో ముంబైకి షాక్ తగిలింది. అయితే కెప్టెన్ రోహిత్, రాయుడు కుదురుగా ఆడటంతో పవర్‌ప్లేలో 39 పరుగులు వచ్చాయి. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించాక రోహిత్ శర్మ అవుటయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన నితిష్ రాణా (9) ఒక సిక్సర్ కొట్టినా ఎక్కువసేపు నిలబడలేదు. ఆరోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన రాయుడు... ఓ ఎండ్‌లో నిలకడగా ఆడాడు. ముంబై విజయానికి 6 ఓవర్లలో 68 పరుగులు అవసరమైన దశలో వాట్సన్ బౌలింగ్‌లో పొలార్డ్ సిక్సర్, ఫోర్‌తో ఒత్తిడి పెంచాడు. కానీ తర్వాతి ఓవర్లో డివిలియర్స్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రాయుడు అవుటయ్యాడు. ముంబైకి 4 ఓవర్లలో 44 పరుగులు అవసరం కాగా... వాట్సన్ వేసిన 17వ ఓవర్లో పొలార్డ్ ధాటికి 18 పరుగులు వచ్చాయి. అటు బట్లర్ కూడా చెలరేగి ఆడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే ముంబై గెలిచింది. పొలార్డ్, బట్లర్ ఐదో వికెట్‌కు అజేయంగా 21 బంతుల్లో 55 పరుగులు జోడించడం విశేషం.


 స్కోరు వివరాలు
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: కోహ్లి (సి) హర్భజన్ (బి) మెక్లీనగన్ 7; గేల్ (సి) రోహిత్ (బి) సౌతీ 5; డివిలియర్స్ (సి) రాయుడు (బి) క్రునాల్ 24; రాహుల్ నాటౌట్ 68; వాట్సన్ రనౌట్ 15; సచిన్ బేబీ నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 151.

వికెట్ల పతనం: 1-8; 2-17; 3-60; 4-98.
బౌలింగ్: సౌతీ 4-0-27-1; మెక్లీనగన్ 4-0-35-1; బుమ్రా 4-0-28-0; క్రునాల్  పాండ్యా 4-0-15-1; హర్భజన్ 3-0-19-0; పొలార్డ్ 1-0-22-0.


ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 25; పార్థీవ్ (సి) వాట్సన్ (బి) అరవింద్ 1; రాయుడు (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 44; నితిష్ రాణా (సి) బిన్నీ (బి) చాహల్ 9; పొలార్డ్ నాటౌట్ 35; బట్లర్ నాటౌట్ 29; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 153.

వికెట్ల పతనం: 1-2; 2-60; 3-79; 4-98.
బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 1-0-2-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-23-1; జోర్డాన్ 3-0-37-0; వాట్సన్ 3-0-38-0; చాహల్ 4-0-16-1; ఆరోన్ 3.4-0-37-2.
 

మరిన్ని వార్తలు