కోహ్లి కసితీరా..

19 Apr, 2019 21:52 IST|Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 214 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శతకం సాధించి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. కోహ్లి 58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగులు సాధించి ఆఖరి బంతికి ఔటయ్యాడు. అతనికి జతగా మొయిన్‌ అలీ(66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆర్సీబీ రెండొందల పరుగుల మార్కును అవలీలగా చేరింది. చివర్లో స్టోయినిస్‌(17 నాటౌట్‌; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్లు) సమయోచితంగా బ్యాటింగ్‌ చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

 టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ ఆదిలోనే పార్ధివ్‌ పటేల్‌(11) వికెట్‌ను నష్టపోయింది. ఆపై అక్షదీప్‌ నాథ్‌(13)కూడా నిరాశపరచడంతో ఆర్సీబీ 59 పరుగులకే రెండో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో కోహ్లి-మొయిన్‌ అలీల జోడి తొలుత బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసింది. అయితే ఓ దశలో మొయిన్‌ అలీ రెచ్చిపోయి ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. అతనికి కోహ్లి నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ క్రమంలోనే కోహ్లి ముందుగా హాఫ్‌ సెంచరీ సాధించగా, కాసేపటికి అలీ కూడా అర్థ శతకం నమోదు చేశాడు. ప్రధానంగా కుల్దీప్‌ వేసిన 16 ఓవర్‌లో 27 పరుగులు సాధించిన మొయిన్‌ అలీ.. అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. అటు తర్వాత ఇక కోహ్లి విజృంభించి ఆడాడు. బౌలర్‌ ఎవరన్నది చూడకుండా సొగసైన షాట్లతో అలరించాడు. ఆఖరి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. చివరి బంతికి పెవిలియన్‌ చేరాడు. ఆర్సీబీ తొలి పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేస్తే, చివరి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేయడం విశేషం.

>
మరిన్ని వార్తలు