అన్నీ ఆర్సీబీ ఖాతాలోనే..

23 Mar, 2019 22:20 IST|Sakshi

చెన్నై:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజస్‌ ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 70 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ఆటగాళ్లలో ఒక్క పార్థివ్‌ పటేల్‌(29) మినహా మిగతా వారంతా రెండంకెల స్కోరును దాటలేకపోయారు. ఏకంగా పదిమంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆర్సీబీ స్వల్ప స్కోరునే బోర్డుపై ఉంచింది. ఈ క్రమంలోనే చెత్త రికార్డును ఆర్సీబీ మరోసారి మూటగట్టుకుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైన అపప్రథను ఆర్సీబీ సొంతం చేసుకుంది.

ఇక్కడ సింగిల్‌ డిజిట్‌ను నమోదు చేయడంలో తమకు ఎవరు సాటిలేరని నిరూపించుకుంది. గతంలో మూడు సందర్భాల్లో ఆర్సీబీ అత్యధికంగా సింగిల్ డిజిట్లను నమోదు చేసింది. 2008లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 మంది ఆర్సీబీ ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైతే, 2017లో కేకేఆర్‌తోనే జరిగిన మ్యాచ్‌లో 11 మంది ఆర్సీబీ ఆటగాళ్లు రెండంకెల మార్కును దాటలేకపోయారు. అదే ఏడాది రైజింగ్‌ పుణెతో జరిగిన మ్యాచ్‌లో 10 మంది ఆర్సీబీ ప్లేయర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. తాజా మ్యాచ్‌లో సైతం 10 మంది ఆర్సీబీ ఆటగాళ్లు రెండంకెల స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఈ నాలుగుసార్లు ఆర్సీబీనే అత్యధికంగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు