బెంగళూరు ఆశలపై నీళ్లు!

26 Apr, 2017 07:03 IST|Sakshi
బెంగళూరు ఆశలపై నీళ్లు!

చిన్నస్వామి స్టేడియంను ముంచెత్తిన వర్షం
సన్‌రైజర్స్, ఆర్‌సీబీ మ్యాచ్‌ రద్దు
కోహ్లి సేన అవకాశాలకు దెబ్బ


బెంగళూరు: గత మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత సొంతగడ్డపై కోలుకొని మళ్లీ ఐపీఎల్‌ రేసులోకి దూసుకు రావాలనుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆశలకు వర్షం అడ్డుకట్ట వేసింది. భారీ వర్షం కారణంగా మంగళవారం ఇక్కడ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. మ్యాచ్‌ నిర్ణీత సమయానికి చాలా ముందు నుంచే కురిసిన వర్షం ఏ దశలో కూడా తెరిపినివ్వలేదు. వాన ఆగితే అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యవస్థ ద్వారా వేగంగా గ్రౌండ్‌ను మ్యాచ్‌ సిద్ధం చేయవచ్చని సిబ్బంది ఆశించినా అలాంటి అవకాశమే లభించలేదు. దాంతో కనీసం టాస్‌ కూడా వేయకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేయాల్సి వచ్చింది.

దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. ఐపీఎల్‌–2017లో వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్‌ ఇదే. సొంత మైదానంలో ఈ మ్యాచ్‌తో పాటు గురువారం గుజరాత్‌ లయన్స్‌తో బెంగళూరు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో కూడా గెలిస్తే ఆ జట్టు ముందంజ వేసే అవకాశం ఉండేది. అయితే తాజా ఫలితంతో ఆర్‌సీబీ అవకాశాలకు గట్టి దెబ్బ పడింది. ప్రస్తుతం ఆడిన 8 మ్యాచ్‌లలో 2 మాత్రమే గెలిచిన కోహ్లి సేన లీగ్‌లో ముందంజ వేయాలంటే అద్భుతాలు జరగాల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్‌లోనే నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సన్‌రైజర్స్‌ జట్టు, ప్రత్యర్థి వేదికపై తొలి విజయం అందుకోవాలని ఆశించినా మ్యాచ్‌ రద్దుతో అది సాధ్యం కాలేదు. శుక్రవారం మొహాలీలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తలపడుతుంది.

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇలాగే...
ఐపీఎల్‌–5లో భాగంగా 2012 ఇదే ఏప్రిల్‌ 25న కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సరిగ్గా ఇదే ఫలితం వచ్చింది. అప్పుడు కూడా భారీ వర్షం కారణంగా బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది.

ఐపీఎల్‌లో నేడు
రైజింగ్‌ పుణే  & కోల్‌కతా
వేదిక: పుణే, రా. గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు