షఫాలీని అలా చూడటం కష్టమైంది: బ్రెట్‌ లీ

9 Mar, 2020 16:05 IST|Sakshi

మెల్‌బోర్న్‌: టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. లీగ్‌ దశలో అప్రతిహతవిజయాలతో దూసుకపోయిన హర్మన్‌ సేన.. ఫైనల్‌ పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది. లీగ్‌ దశలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత జట్టు.. టైటిల్‌ పోరులో అట్టర్‌ ఫ్లాఫ్‌ షోతో నిరుత్సాహపరిచింది. ముఖ్యంగా లీగ్‌ దశలో బ్యాటింగ్‌ భారాన్ని మోసిన యువ సంచలనం షఫాలీ వర్మ తుది పోరులో చేతులెత్తేసింది.  ఈ క్రమంలో తను ఔటైన తర్వాత, ఓటమి తర్వాత షఫాలీ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ)

ఇది సహచర క్రీడాకారిణులతో పాటు ప్రపంచ క్రికెట్‌ను కూడా కదిలించింది. దీనిపై ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ బ్రెట్‌ లీ.. ఐసీసీకి రాసిన తన కాలమ్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘ షఫాలీ ఏడ్వడం నాకు బాధనిపించింది. మ్యాచ్‌ ముగిసిపోయాక ఆమె కన్నీట పర్యంతం కావడం నాకు చాలా కష్టంగా అనిపింది. కానీ గర్వించదగ్గ క్రికెటర్‌. ఆస్ట్రేలియాలో ఆమె ప్రదర్శన అద్భుతంగా సాగింది. తొలి టోర్నమెంట్‌ ఆడటానికి ఇక్కడకు వచ్చిన షఫాలీ తన టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. మానసికంగా ఆమె చాలా ధృఢంగా అనిపించారు. ఇక్కడ నుంచి ఆమె మరింత పరిణితి సాధిస్తుందని అనుకుంటున్నా. ఈ టోర్నమెంట్‌లో సాధించిన అనుభవంతో ఆమె మరింత రాటుదేలడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఆడే తదుపరి టోర్నీల్లో ఆమె చేసే భారీ స్కోర్లు ఎవ్వర్నీ ఆశ్చర్యపరచకపోవచ్చు. సానుకూల ధోరణితో ముందుకు సాగుతుందనే అనుకుంటున్నా. ఇది భారత్‌ మహిళలకు తీవ్ర నిరాశను మిగిల్చిన రాత్రి. కానీ వారు మరింత ఆశావాహ ధృక్పథంతో రాటుదేలతారు. దీంతో వారు క్రికెట్‌ ఏమీ ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకోండి’ అని బ్రెట్‌ లీ రాసుకొచ్చాడు. (ఐసీసీ అత్యుత్తమ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..)

>
మరిన్ని వార్తలు