18 Dec, 2018 11:07 IST|Sakshi

పెర్త్‌ : ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్‌.. రెండో టెస్ట్‌లో చతికిలపడింది. తొలి టెస్ట్‌ విజయంతో సిరీస్‌లో ఆధిక్యం సాధించిన కోహ్లి సేన.. అదే ఊపును కొనసాగిస్తుందని అందరూ భావించారు. తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించి విజయాన్నందుకున్న టీమిండియా రెండో టెస్ట్‌లో స్వియ తప్పిదాలతో ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. జట్టు కూర్పు, ఓపెనర్ల విఫలం, తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి విషయంలో అంపైర్‌ తప్పుడు నిర్ణయం భారత విజయవకాశాలను దెబ్బతీశాయి.

స్పిన్నర్‌ లేకపోవడం..
తొలి టెస్ట్‌లో రాణించిన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గాయంతో సెకండ్‌ మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో మరో స్పిన్నర్‌ రవీంద్ర జడేజాను తీసుకోకుండా కోహ్లి పెద్ద తప్పు చేశాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, చివరకు జట్టులోని ఆటగాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు. పిచ్‌ను అంచనా వేసే విషయంలో కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రిలు పప్పులో కాలేశారు. పేస్‌కు అనుకూలిస్తుందని భ్రమపడి నలుగురు పేస్‌ బౌలర్లతో బరిలోకి దిగారు. ఇది భారత్‌ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ విషయం ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయాన్‌ 8 వికెట్లతో చెలరేగడంతో స్పష్టమైంది. ఇక ఒక్క బౌలింగ్‌లోనే కాదు.. అటు బ్యాటింగ్‌లోని పెద్ద దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ అనంతరం ఈ విషయం సుస్పష్టమైంది.

కోహ్లి వికెట్‌ అనంతరం అందరూ బౌలర్లే కావడంతో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ దాటిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ స్థానంలో జడేజా.. పంత్‌కు తోడుగా ఉండి ఉంటే మరో మంచి భాగస్వామ్యంతో భారత్‌కు స్పల్ప ఆధిక్యమన్నా లభించేది. అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. భారత ఓటమి అనంతరం టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ విషయాన్నే చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 6 వికెట్లతో చెలరేగిన మహ్మద్‌ షమీ సైతం ఒక స్పిన్నర్‌ ఉంటే బాగుండూ అని అభిప్రాయపడ్డాడు.

కొంపముంచిన అంపైర్‌ నిర్ణయం..
భారత తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వికెట్‌ విషయంలో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం కూడా భారత్‌ కొంపముంచింది. హ్యాండ్స్‌కోంబ్‌ పట్టిన క్యాచ్‌తో వివాదాస్పద రీతిలో పెవిలియన్‌ చేరిన కోహ్లి అప్పటికే అద్భుత సెంచరీతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. జట్టు స్కోర్‌ 251 పరుగుల వద్ద కోహ్లి(123) ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ వికెట్‌ అనంతరం మరో 32 పరుగుల్లోపే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో ఆతిథ్య జట్టు 43 పరుగులు ఆధిక్యం లభించింది. కోహ్లి మరికొద్ది సేపు ఉంటే.. పంత్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పే అవకాశం ఉండేది. భారీ ఆధిక్యం సాధించకపోయినా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై పైచేయి సాధించేది. ఇది ఇరు జట్ల సెకండ్‌ ఇన్నింగ్స్‌లపై ప్రభావం చూపేది.

ఓపెనర్ల విఫలం.. 
ఈ సిరీస్‌లో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌లు దారుణంగా విఫలమవుతుండటం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాట్స్‌మెన్‌ తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. అంతేకాకుండా ప్రత్యిర్థి బౌలర్లకు బలంగా మారుతోంది. ఈ ప్రభావం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ 2 పరుగులు చేయగా.. మురళీ విజయ్‌ డకౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్‌ డకౌట్‌ కాగా.. మురళి విజయ్‌ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో చతేశ్వరా పుజారా(24, 4) దారుణంగా విఫలమయ్యాడు. 

ఇక కోహ్లి ఔట్‌ అయిన అనంతరం మ్యాచ్‌ చేజారినట్లు ఇతర ఆటగాళ్లు భావించడం కూడా భారత్‌కు ప్రతికూలంగా మారుతోంది. ఈ విషయం చివరి రోజు ఆటతో స్పష్టమైంది. కనీస పోరాట పటిమ ప్రదర్శించకుండా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. విహారి, పంత్‌లు వారికి దక్కిన చక్కని అవకాశాలను ఉపయోగించుకోవడం లేదు. అంతా కోహ్లిపైనే ఆధారపడటం కూడా భారత్‌కు అంతమంచిది కాదు. 

మరిన్ని వార్తలు