మహిళల క్రికెట్‌లో ప్రపంచ రికార్డు!

9 Mar, 2020 11:30 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఆసీస్‌ మరోసారి ముద్దాడింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మెగా కప్‌ను ఐదోసారి అందుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.  స్టార్‌ బ్యాటర్‌ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్‌ బెత్‌ మూనీ (61 నాటౌట్‌; 43 బంతుల్లో 9ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటై పరాజయం చెందింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ)

కాగా,  ఈ టీ20 కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఒక ప్రపంచ రికార్డు నమోదైంది. రికార్డు సంఖ్యలో  86,174 మంది ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరయ్యారు. దాంతో ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రపంచ మహిళల క్రికెట్‌ చరిత్రలో రికార్డు వీక్షక్షులు హాజరైన మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఆస్ట్రేలియాలో ఇప్పటివరకూ జరిగిన మహిళల స్పోర్ట్స్‌ ఈవెంట్‌ పరంగా చూసినా ఎక్కువ మంది హాజరైన మ్యాచ్‌ ఇదే. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున జరిగిన మ్యాచ్‌కు ఇంతటి విశేష ఆదరణ రావడం ఇక్కడ మరో విశేషం. ఓవరాల్‌గా చూస్తే మహిళల స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో అత్యధిక మంది వీక్షకుల హాజరైన మ్యాచ్‌ 1999లో కాలిఫోర్నియాలో జరిగిన సాకర్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌. 21 ఏళ్ల నాటి మహిళల సాకర్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు 90, 185 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. (మన వనిత... పరాజిత)

మరిన్ని వార్తలు