అగార్కర్ 'బ్యాటింగ్ రికార్డు' పదిలం

1 Oct, 2017 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ:అజిత్ అగార్కర్..ఒకప్పటి భారత పేసర్. 1998లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన అగార్కర్.. దాదాపు తొమ్మిదేళ్లు జట్టులో కొనసాగాడు. అటు బంతితోనే కాకుండా, అప్పుడప్పుడు బ్యాట్ తో కూడా మెరుస్తూ భారత జట్టు విజయాల్లో భాగస్వామ్యం అయ్యేవాడు. ఈ క్రమంలోనే భారత జట్టు తరపున వన్డేల్లో వేగవంతమైన అర్థ శతకాన్ని సాధించాడు. 17 ఏళ్ల క్రితం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో  అగార్కర్ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదే నేటికి భారత్ తరపున వన్డే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా పదిలంగా ఉంది.

2000వ సంవత్సరంలో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 14వ తేదీన జింబాబ్వేతో జరిగిన ఆఖరి వన్డేలో భారత స్కోరు 216/6 వద్ద బ్యాటింగ్ వెళ్లిన అగార్కర్.. ఏడో వికెట్ కు 85 పరుగులు జత చేశాడు. అందులో అగార్కర్ అజేయంగా 67 పరుగుల్ని సాధించడం విశేషం. ఈ క్రమంలోనే అగార్కర్ వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సాధించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్ కు అగార్కర్ గుడ్ బై చెప్పాడు. 26 టెస్టుల్లో 58 వికెట్లు తీసుకోగా, 191 వన్డేల్లో 288 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఒక సెంచరీ సాధించిన అగార్కర్.. వన్డేల్లో మూడు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు 95. ఇదిలా ఉంచితే, ఓవరాల్ గా వన్డేల్లో ఫాస్టెస్ట్ రికార్డు నెలకొల్సిన ఘనత దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. 16 బంతుల్లో డివిలియర్స్ అర్ధ శతకం సాధించాడు.

>
మరిన్ని వార్తలు