రోహిత్‌-ధావన్‌ల రికార్డులు

24 Sep, 2018 10:53 IST|Sakshi

దుబాయ్‌: టీమిండియా వన్డే ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు పలు ఘనతల్ని సాధించారు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో రోహిత్‌(111 నాటౌట్‌)-ధావన్‌(114)ల జంట తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఛేజింగ్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస‍్వామ‍్యాన్ని సాధించిన భారత జోడిగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే 2009లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌పై గంభీర్‌-సెహ్వాగ్‌ జోడి సాధించిన 209 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని అధిగమించారు. మరొకవైపు వన్డేల్లో తొలి వికెట్‌కు ఎక్కువసార్లు 100 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండో భారత్‌ జోడిగా రోహిత్‌-ధావన్‌ల జోడి నిలిచింది. ఇక్కడ సచిన్‌-గంగూలీ(21సార్లు) తొలి స్థానంలో ఉండగా, రోహిత్‌-ధావన్‌ల జోడి(13సార్లు) రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా తొలి వికెట్‌కు ఎక్కువసార్లు 100కంటే ఎక్కువ పరుగులు నమోదు చేసిన నాలుగో జోడీగా రోహిత్‌–ధావన్‌లు గుర్తింపు పొందారు.

అదే సమయంలో పాకిస్తాన్‌పై ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌ సెంచరీలు చేయడం ఇది మూ డోసారి. గతంలో 2006 షార్జాలో సచిన్‌ (118), సిద్ధూ (101); 2005లో కొచ్చిలో సెహ్వాగ్‌ (108), ద్రవిడ్‌ (104) ఈ ఘనత సాధించారు.  ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది ఏడోసారి. గతంలో సచిన్‌–గంగూలీ మూడుసార్లు (1998లో శ్రీలంకపై; 2001లో దక్షిణాఫ్రికాపై; 2001లో కెన్యాపై), సెహ్వాగ్‌–గంగూలీ (2002లో ఇంగ్లండ్‌పై), సెహ్వాగ్‌–సచిన్‌ టెండూల్కర్‌ (2003లో న్యూజిలాండ్‌పై), రహానే–ధావన్‌ (2014లో శ్రీలంకపై) ఒక్కోసారి ఇలా చేశారు. కాగా, వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డుల కెక్కాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే(181) ఏడు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదవ బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో హషీమ్‌ ఆమ్లా(150 ఇన్నింగ్స్‌ల్లో), విరాట్‌ కోహ్లి(161), ఏబీ డివిలియర్స్‌ (166), సౌరవ్‌ గంగూలీ (174) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

పాక్‌ను ‘శత’కొట్టారు

మరిన్ని వార్తలు