హర్భజన్‌, ద్యుతీ చంద్‌ నామినేషన్లు తిరస్కరణ!

28 Jul, 2019 20:10 IST|Sakshi
ద్యుతీ చంద్‌, హర్భజన్‌ సింగ్‌

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారాలకు భారత స్టార్ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌, టీమిండియా సీనియర్‌ క్రికెటర్ హర్భజన్‌సింగ్‌ నామినేషన్లను కేంద్ర క్రీడా శాఖ తిరస్కరించింది. అర్జున అవార్డుకు ద్యుతీచంద్‌, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌సింగ్‌ నామినేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌)కు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

‘ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గడువు ముగిసిన తరువాత నామినేషన్‌లు దాఖలు చేయడంతో వారి పేర్లను తిరస్కరించారు. ముఖ్యంగా ద్యుతీ చంద్‌ విషయంలో గడువు ముగియడమే కాకుండా, ఆమె పతకాలు కూడా ర్యాంకింగ్ క్రమంలో లేవు. దీంతో మంత్రిత్వ శాఖ పతకాల ప్రకారం ర్యాంకింగ్‌ ఇవ్వాలని అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎఫ్‌ఐ)ను కోరింది. అయితే వచ్చిన నామినేషన్స్‌లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పేరును తిరస్కరించారు’ అని ఆ అధికారి చెప్పుకొచ్చారు.

హర్భజన్ సింగ్ విషయానికి వస్తే దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్ 30 ఆఖరి తేదీ కాగా, పంజాబ్ ప్రభుత్వం రెండు నెలలు ఆలస్యంగా పంపించింది. ఇదిలా ఉంటే, తన నామినేషన్‌ తిరస్కరణకు గురవడంపై ద్యుతీ చంద్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలిసింది. అనంతరం మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశాను. ఇటలీలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో నేను గెలిచిన స్వర్ణ పతాకాన్ని ఆయనకు చూపించాను. నా ఫైల్‌ను పంపించాలని కోరాను. దానికి ఆయన అర్జున అవార్డుకు నామినేషన్‌ను తిరిగి పంపిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాబోయే పోటీలకు సిద్ధమవ్వాలని సూచించారు. అర్జున అవార్డు అవకాశాన్ని ఇంకా కోల్పోలేదు. ఈ విషయంలో అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. రాష్ట్రంలో ఎన్నికలు, తుఫాను వల్ల నా నామినేషన్‌ను ఆలస్యంగా పంపించినట్లు తెలుసు’’అని అన్నారు.

మరిన్ని వార్తలు