ధోనితో ఆ లోగో తీయించండి

7 Jun, 2019 04:27 IST|Sakshi

బీసీసీఐని కోరిన ఐసీసీ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనికి భారత ఆర్మీ అంటే అభిమానం, గౌరవం. ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా ఉన్న ధోని రాష్ట్రపతి భవన్‌లో జరి గిన పద్మ అవార్డుల కార్యక్రమంలో ఆర్మీ కవాతుతో పురస్కారాన్ని స్వీకరించాడు. పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించడమే కాదు... వారిని స్మరిస్తూ ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం ఆర్మీ క్యాపులతో బరిలోకి దిగేలా చేశాడు. తనకు ఆర్మీలో చేరాలనే కోరిక ఉందని చాలాసార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌లో ధోని కీపింగ్‌ గ్లౌజ్‌పై ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ (ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో) వేయించుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫెలుక్‌వాయోను స్టంపౌట్‌ చేయడం ద్వారా ఈ గ్లౌజ్‌పై ఉన్న లోగో అందరికంటా పడింది. అతని దేశభక్తి ఉన్నతమైనదే అయినా... దీనిపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐని ఆ గుర్తు తీయించాలని కోరామని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ (కమ్యూనికేషన్స్‌) ఫర్లాంగ్‌ వెల్లడించారు.

 

మరిన్ని వార్తలు