కోహ్లి (Vs) ఆస్ట్రేలియా 

29 Nov, 2018 01:11 IST|Sakshi

భారత కెప్టెన్‌ ప్రదర్శన పైనే ఆధారపడిన సిరీస్‌ ఫలితం

ఆసీస్‌ బౌలర్ల  తొలి లక్ష్యం అతనే   

లాలా అమర్‌నాథ్, చందూ బోర్డే, మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ, బిషన్‌ సింగ్‌ బేడీ, సునీల్‌ గావస్కర్, కపిల్‌ దేవ్, మొహమ్మద్‌ అజహరుద్దీన్, సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ, అనిల్‌ కుంబ్లే, మహేంద్ర సింగ్‌ ధోని... వీరంతా ఆస్ట్రేలియా గడ్డపై భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లు. అయితే ఇందులో ఒక్కరు కూడా సిరీస్‌ను గెలుచుకున్న ఘనతను దక్కించుకోలేకపోయారు. కొన్నిసార్లు అరుదైన, అద్భుతమైన మ్యాచ్‌ విజయాలు దక్కినా సిరీస్‌ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు కొత్త చరిత్రను లిఖించే అవకాశం కోహ్లి ముంగిట నిలిచింది. ఇప్పుడు అతను కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ హోదాలో కంగారూల గడ్డపై యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. కోహ్లి తాజా ఫామ్‌ను, అతని ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే ఇది ఆస్ట్రేలియాతో భారత్‌ సమరంకంటే కోహ్లి, ఆసీస్‌ మధ్య పోరుగానే కనిపిస్తోంది.   

సాక్షి క్రీడా విభాగం:విరాట్‌ కోహ్లి ఆస్ట్రేలియాలో జరిగిన గత సిరీస్‌లోనూ రెండు టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో భారత్‌ ఒకటి గెలిచి, మరొకటి ఓడింది. అయితే నాడు ధోని గైర్హాజరు, ఆ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటన వల్ల అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో అప్పటికప్పుడు జరిగిన కెప్టెన్సీ ఎంపిక అది. కాబట్టి నాటి ఫలితాన్ని పూర్తిగా కోహ్లి నాయకత్వానికి ఆపాదించలేము. మరోవైపు బ్యాట్స్‌మన్‌గా మాత్రం అప్పుడే అతను ఆసీస్‌ పని పట్టాడు. ఏకంగా 692 పరుగులతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు. కోహ్లి దూకుడుతో భారత్‌ గెలిచే అవకాశాలు సృష్టించుకోగలిగింది. దురదృష్టవశాత్తూ ఫలితం ప్రతికూలంగా వచ్చినా కంగారూల గుండెల్లో విరాట్‌ వణుకు పుట్టిం చాడు. మిషెల్‌ జాన్సన్‌ను సాధారణ బౌలర్‌ స్థాయికి దిగజార్చిన నాటి విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ ప్రదర్శన ఆసీస్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది. ఈ నాలుగేళ్లలో కోహ్లి శిఖర స్థాయికి చేరుకున్నాడు. ఆటగాడిగా లెక్కలేనన్ని రికార్డులు సృష్టించిన అతను, కెప్టెన్‌గా కూడా తనదైన ప్రత్యేకతను ప్రదర్శించాడు. ‘డ్రా’ల కోసం కాకుండా ఎలాగైనా గెలవాలనే కసి, ఎంతటి లక్ష్యాన్నైనా లెక్క చేయని తత్వంతో కోహ్లి సిద్ధంగా ఉన్నాడు. కోహ్లి ఆలోచనాశైలి కూడా ఆసీస్‌ గడ్డపై భారత్‌ సిరీస్‌ విజయంపై ఆశలు పెంచుతోంది.  

కోహ్లి మినహా... 
భారత్‌తో తలపడబోతున్న ఆస్ట్రేలియా జ ట్టులో ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ లేరు. అయితే ప్రత్యర్థి బలహీనతలకంటే సహజంగా తమ బలంపైనే ఏ జట్టయినా దృష్టి పెడుతుంది. 2014–15 సిరీస్‌ను గుర్తు చేసుకుంటే కోహ్లి విలువేమిటో, ఇతర ఆటగాళ్ల పాత్ర ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో జరిగిన సిరీస్‌లు, అక్కడ వచ్చిన ఫలితాలు చూస్తే ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించినా కూడా చివరకు కోహ్లి వల్లే గెలుపు సాధ్యమని తెలిసిపోతుంది. కాబట్టి ఆస్ట్రేలియా మాజీలు చెప్పినట్లు కోహ్లిపైనే అంతా ఆధారపడి ఉంది. అతడిని పడగొడితే చాలు సిరీస్‌ చిక్కినట్లే అనే భావనలో ఆసీస్‌ బౌలర్లు కూడా ఉన్నారు. గత సిరీస్‌లో కోహ్లి కాకుండా మురళీ విజయ్‌ 482 పరుగులు, రహానే 399 పరుగులతో నిలకడగా రాణించారు. బహుశా నాటి ప్రదర్శనే విజయ్‌కు ఆసీస్‌ గడ్డపై మరో అవకాశం కల్పించింది. అయితే ఇటీవల ఇంగ్లండ్‌లో విజయ్‌ ఆటతీరు, చాలా కాలంగా రహానే వైఫల్యాలు ఆందోళనపరిచేవే. పుజారా ఆ సిరీస్‌లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలోనే తొలి సెంచరీ చేసిన రాహుల్‌ ఇప్పుడు తడబడుతుండగా... కుర్రాళ్లు పృథ్వీ షా, హనుమ విహారిలకు ఇది పెద్ద సవాల్‌. గత సిరీస్‌లోనూ మూడు టెస్టుల్లో కలిపి 173 పరుగులే చేసిన రోహిత్‌ శర్మ టెస్టు ఆటగాడిగా ఎదిగిందీ లేదు.  

అంతకు ముందూ అతనే... 
భారత్‌ జట్టు 0–4తో చిత్తుగా ఓడిన 2011–12 సిరీస్‌లో కూడా కోహ్లినే భారత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 300 పరుగులు చేశాడు. కోహ్లి కెరీర్‌లో తొలి సెంచరీ ఇదే సిరీస్‌లోని చివరి టెస్టులో వచ్చింది. గణాంకాలన్నీ చూస్తే భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా కోహ్లి చుట్టే మన జట్టు పరిభ్రమిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడిని నమ్ముకొనే సిరీస్‌ను సాధించగలమని భావిస్తోంది. ఒకే ఒక్కడుతో తలపడేందుకు ఆసీస్‌ 11 మందితో సిద్ధమవుతోందనేది స్పష్టం. మరి కోహ్లి మన ఆశలు నిలబెడతాడా, అతని కోసం ప్రత్యర్థి ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమైందా అనేది ఆసక్తికరం. 

ఆస్ట్రేలియా గడ్డపై  కోహ్లి టెస్టు రికార్డు 
టెస్టులు  8 
ఇన్నింగ్స్‌  16  
పరుగులు 992
సగటు 52.0 
సెంచరీలు 5
అర్ధ సెంచరీలు 2
అత్యధిక స్కోరు 169 

మరిన్ని వార్తలు