వామ్మో ఎన్‌సీఏనా!

3 Jan, 2020 01:39 IST|Sakshi

ప్రపంచ కప్‌ల  హీరోలు యువరాజ్, గౌతమ్‌ గంభీర్‌లతో పాటు ఎంతోమంది జాతీయ, దేశవాళీ క్రికెటర్లను రాటుదేల్చిన జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ఇప్పుడో నామమాత్రపు అకాడమీ అయింది. కేవలం పునరావాసం, ఫిట్‌నెస్‌ టెస్టులను నిర్వహించే కేంద్రంగా మారిపోయింది. కానీ అసలు ఎన్‌సీఏను స్థాపించింది వీటికోసం కానేకాదు. కపిల్‌దేవ్, సచిన్, లక్ష్మణ్, శ్రీనాథ్, కుంబ్లేలాంటి దిగ్గజాలను తయారు చేయడం కోసం. మరిప్పుడు జరిగేది వేరు. వామ్మో ఎన్‌సీఏనా... అక్కడికెందుకు అనే పరిస్థితి తలెత్తింది. మొత్తానికి అకాడమీకే చికిత్స చేయాల్సిన అవసరం వచ్చిందిపుడు!

సాక్షి, క్రీడావిభాగం: బీసీసీఐ దివంగత పాలనాధ్యక్షుడు రాజ్‌సింగ్‌ దుంగార్పూర్‌ ఓ మేధావి. ఆలోచనల్లో, భవిష్యత్తు నిర్మాణంలో ఆయన్ని మించినవాడు భారత క్రికెట్‌ నియంత్రణ మండలిలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అలనాడు చీఫ్‌ సెలక్టర్‌గా ఓ ముంబై కుర్రాడ్ని భారత జట్టుకు ఎంపిక చేస్తే అతను ఏకంగా ‘24 క్యారెట్‌ గోల్డ్‌’ (24 ఏళ్లు క్రికెట్‌ ఆడిన) సచిన్‌గా విశ్వవిఖ్యాతమయ్యాడు. అనంతరం బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్‌లో మతమైన క్రికెట్‌ కోసమే 2000లో ప్రత్యేకంగా జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)ని బెంగళూరులో స్థాపించారు.

ఆయన లక్ష్యం సచిన్, కపిల్‌దేవ్, శ్రీనాథ్‌లాంటోళ్లు మరెంతో మంది రావాలని! ఆయన లక్ష్యం ఉన్నతమైంది కాబట్టే మొదట్లో కుర్రాళ్లు బాగానే రాటుదేలారు. కానీ కాలం గడిచేకొద్దీ అకాడమీ గమనం మారింది. ప్రతిభాన్వేషణ మరిచి దెబ్బలతో వచ్చిపోయే ఆటగాళ్లతో సరిపెట్టుకుంది. అలా పూర్తిగా పునరావాస శిబిరమైంది. ఆ తర్వాత  అదీ లేదు.

ఓ పరీక్షా కేంద్రంగా... 
బెంగళూరు అకాడమీ రానురాను గాయాల నుంచి కోలుకునేందుకు వెళ్లే నామమాత్రపు శిక్షణ, సలహా కేంద్రమైంది. అందుకేనేమో వృద్ధిమాన్‌ సాహా తదితరులు ఎన్‌సీఏకు మళ్లీ మళ్లీ వెళ్లొచ్చే పనిపడుతోంది. ఇప్పుడేమో కొందరు ఆటగాళ్లు అక్కడికి వెళ్లడం దండగనే ఉద్దేశంతో సొంతంగా కష్టపడుతున్నారు. దీంతో ఇక ఫైనల్‌గా ‘ఫిట్‌నెస్‌’ పరీక్ష కేంద్రమైంది ఎన్‌సీఏ. అంతా బాగయ్యాక నాకో టెస్టు పెట్టరూ అని అడిగేలా దిగజారి పోయింది. ఇలా అకాడమీ అర్థమే మారిపోయింది. ఇది పద్ధతి కాదనుకున్నాడో ఏమో ఎన్‌సీఏ డైరెక్టర్‌ ద్రవిడ్‌... బుమ్రాకు కుదరదని చెప్పాడు.

చివరకు అధ్యక్షుడు గంగూలీ సర్దిచెప్పడంతో ఈ సమస్య తాత్కాలికంగా సమసింది. ఇంతకీ యో–యో టెస్టు అంటే ఏంటని ఓ క్రికెటర్‌ని అడిగితే ‘దేశవాళీ క్రికెట్‌లో బాగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్, వికెట్లు పడగొట్టే బౌలర్లు  ఎన్‌సీఏకు వచ్చాక... అక్కడి కోచ్‌లు, నిష్ణాతులు, ట్రైనర్లు, డాక్టర్లు, విశ్లేషకులు వాళ్లతో ఓ ఫుట్‌బాల్‌ ఆట ఆడుకుంటారు. అందులో బతికొస్తే యో–యో టెస్టు పాసైనట్లు’ అని అక్కడి ప్రహసనాన్ని వివరించాడు. మొత్తానికి ఓ నాణ్యమైన క్రికెటర్లు తయారు కావాల్సిన అకాడమీ ఇప్పుడిలా అభాసు పాలవుతోంది.

సాహా నుంచి భువీ దాకా

ఓ ప్రొఫెషనల్‌ అకాడమీ కాస్తా సాదాసీదా పునరావాస కేంద్రమైంది. టెస్టుల్లో ధోని వారసుడిగా వచ్చిన వృద్ధిమాన్‌ సాహా భుజం గాయంతో 2018 జనవరిలో ఎన్‌సీఏలో చేరాడు. తర్వాత తొడకండరాల గాయమైంది. కాస్త కోలుకోగానే మార్చిలో అతను ఫిట్‌ అని ఎన్‌సీఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. కానీ రెండునెలలు తిరక్కముందే గాయం తిరగదోడింది. అప్పుడు కొత్తగా బొటనవేలి గాయమని నమ్మించే ప్రయత్నం చేసినా... పాత భుజం గాయమేనని తేలింది.

►మరో కపిల్‌ కాగలడనుకున్న హార్దిక్‌ పాండ్యాతో కూడా ఎన్‌సీఏ ఇలాగే ఆడుకుంది. ఆసియా కప్‌ (2018)లో వెన్నునొప్పికి గురైన పాండ్యా పూర్తిగా కోలుకోకముందే ఫిట్‌నెస్‌తో ఉన్నాడని ఐపీఎల్‌ ఆడించింది. తీరా దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్‌ ఆడే సమయానికి మళ్లీ అదే గాయం తిరగబెట్టింది. దీంతో ఐపీఎల్‌ కోసమే ఎన్‌సీఏ ఇలాంటి లెక్కలేని ఫిట్‌నెస్‌ నిర్వహించిందనే విమర్శలొచ్చాయి.

►ఇక పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు అసలేమైందో పసిగట్టలేకపోయింది ఎన్‌సీఏ వైద్యబృందం. ఇతనికి ముందుగా వెన్నుగాయమనే అన్నారు. పునరావాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌ ఆడగానే మళ్లీ గాయమన్నారు. అసలు అతనికి వెన్నుగాయం కాదని ‘స్పోర్ట్స్‌ హెర్నియా’ అని టీమిండియా ఫిజియోథెరపిస్ట్‌ చెబితేగానీ ఎన్‌సీఏ తెలుసుకోలేకపోయింది. అందుకేనేమో బుమ్రా ఎన్‌సీఏతో లాభం లేదనుకొని తన వెన్నుగాయం బాగోగులు తనే చూసుకున్నాడు. కేవలం ఫిట్‌నెస్‌ టెస్టుకే ఎన్‌సీఏకు వచ్చాడు. దీనిపై డైరెక్టర్‌ ద్రవిడ్‌ తిరస్కరించినా తర్వాత అంగీకరించక తప్పలేదు.

భారమంతా దాదా, ద్రవిడ్‌లపైనే 
శాశ్వతంగా ఎన్‌సీఏ లక్ష్యాల్ని చేరుకునే అవసరమొచ్చింది. ఒకనాటి టీమిండియా సహచరులు సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌లు ఇపుడు బోర్డు, అకాడమీ చీఫ్‌ బాధ్యతల్లో ఉన్నారు. వారిద్దరు కచ్చితంగా ఇటువైపు కన్నేస్తే ఎన్‌సీఏ రూపురేఖలు బాగుపడతాయి. అందుకే అకాడమీకి నూతన జవసత్వాలు తెచ్చేందుకు బీసీసీఐ ఇటీవల జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. లండన్‌కు చెందిన ‘ఫోర్టీస్‌’ వైద్య సంస్థ సలహాదారులతో మెడికల్‌ ప్యానెల్‌ను న్యూట్రిషన్‌ హెడ్, సోషల్‌ మీడియా మేనేజర్‌లను నియమించాలని బోర్డు నిర్ణయించింది. పేరున్న వైద్య బృందం ఇకపై ఆటగాళ్ల గాయాల నిర్వహణ–పునరావాసంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.

అలాగే సోషల్‌ మీడియా మేనేజర్‌ వల్ల అకాడమీలోని రోజువారీ కార్యకలాపాలు, వీటిపై వస్తున్న వ్యాఖ్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని బోర్డు భావించింది. ఇవన్నీ రాహుల్‌ నేతృత్వం వహిస్తున్న అకాడమీకి అదనపు బలాన్ని తెచ్చిపెడతాయి. దీంతో అతను ఫలితాలను కూడా అందిస్తాడని గంగూలీ నమ్మకం. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఓ భాగంగా ఉన్న ఎన్‌సీఏ త్వరలోనే బెంగళూరు శివారుకు తరలిస్తారు. అక్కడి సువిశాలమైన స్థలంలో అంతర్జాతీయ స్థాయి ఆధునిక హంగులతో అకాడమీ రూపొందనుంది.

>
మరిన్ని వార్తలు