త్వరలో స్పోర్ట్స్‌ స్కూల్‌పై సమీక్ష

25 Jul, 2019 09:57 IST|Sakshi

హరితహారం సందర్భంగా క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వ్యాఖ్య  

హైదరాబాద్‌: హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌)లో మౌలిక వసతుల కల్పనపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్పోర్ట్స్‌స్కూల్‌లో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావడం క్రీడాకారుల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. క్రీడలతో పాటు చదువులోనూ ఏకాగ్రత చూపించాలని ఆయన విద్యార్థులను కోరారు. సింథటిక్‌ ట్రాక్, ఫుట్‌బాల్‌ గ్రౌండ్, స్విమ్మింగ్‌పూల్‌తో పాటు స్పోర్ట్స్‌ స్కూల్‌లో అవసరమయ్యే సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మరో 15 రోజుల్లో ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

 10 జీపీఏ సాధిస్తే రూ. 25 వేలు ఇస్తా: మంత్రి మల్లారెడ్డి

పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధిస్తే రూ. 25 వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తానని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలోని ఏ క్రీడా పాఠశాల లేనంత విశాలంగా 200 ఎకరాల్లో తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ ఉందన్న ఆయన స్థానిక మంత్రిగా స్కూల్‌ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గతంలో పాఠశాల అభివృద్ధికి కోటి రూపాయల నిధులు కేటాయిస్తానని మాట ఇచ్చానని, అందులో భాగంగా రూ. 25 లక్షలు మంజూరు చేశానని తెలిపారు. మిగిలిన నిధులు త్వరలోనే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులను సన్మానించి, ట్రాక్‌ సూట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌ రావు, శాట్స్‌ ఎండీ దినకర్‌బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు